భారీ వాహనాలతో అక్రమ మట్టి తోలకాలు.. టెంట్ వేసి అడ్డుకున్న అన్నదాతలు..

Published: Saturday February 04, 2023
తల్లాడ, పిబ్రవరి 3 (ప్రజా పాలన న్యూస్):
 *పైకి ఆకాశం వైపుచూస్తే దానంత ఎత్తులో ఉన్న గుట్టలను సైతం పిండేస్తున్నారు. ఇప్పటికే సగం గుట్ట కరిగిపోయింది. భారీ వాహనాలతో మట్టిని తరలిస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ గుట్ట పరిధిలోని రైతులు అనేకసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసే నాధుడే కరువయ్యాడు.* 
 
 *వివరాలు ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ సమీపంలో అన్నారుగూడెం, జన్నారం వెళ్లే రహదారిలో ఆకాశంఎత్తులో రెండు గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టల నుండి భారీ టన్నులకొద్దీ వాహనాలతో మట్టిని రోజుకు సుమారు 500 నుండి 1000  ఈ టిప్పులను తరలిస్తున్నారు.  దీంతో ఆ రోడ్డు మార్గం పూర్తిగా ధ్వంసం అవ్వడమే  కాకుండా అటువైపు వెళ్ళే రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. దీంతో శుక్రవారం ఆ వాహనాలకు రైతులు తమ ద్విచక్ర వాహనాలను అడ్డుపెట్టి కూర్చొని కదలనివ్వమని టెంట్ వేసి ధర్నా నిర్వహించారు.* 
 
 *పంటలకు తీవ్ర నష్టం..* 
 
 *ఆ గుట్ట పరిధిలో రెండు వైపులా సుమారు 500 ఎకరాలు పంటలు సాగవుతున్నాయి. మిరప, మొక్కజొన్న, పత్తి పంటలు రైతులు సాగు చేస్తున్నారు. లక్షలాధి రూపాయలు పెట్టుబడులు పెట్టినప్పటికీ నిత్యం దుమ్ము, ధూళి పంటపై పడటంతో చేతికొచ్చిన పంట రైతులకు దక్కటం లేదు.* 
 
 *24 గంటలు రాకపోకలు కొనసాగింపు..* 
 
 *గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో భారీ వాహనాలతో ఇక్కడ మట్టిని తరలిస్తున్నారు. నిత్యం రేయి పగలు 24 గంటలు భారీగా తరలి వెళ్తున్నాయి.  గ్రీన్ ఫీల్డ్ తో పాటు ప్రైవేటుగా కూడా జిల్లావ్యాప్తంగా అధిక రూపాయలు వసూలు చేసి మట్టిని అమ్ముకుంటున్నారు.* 
 
 *ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోని అధికారులు..* 
 
 *మా రోడ్లు పాడైపోతున్నాయని, మా పంటలకు నష్టపరిహారం జరుగుతుందని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా శాశ్వత పరిష్కారం లేదని రైతులు వాపోతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా పంట చేతికొచ్చే దశలో భారీగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా భారీ వాహనాలను ఆపి మాకు నష్టపరిహారం చెల్లించాలని వారు టెంటు వేసి భీస్మించుకొని కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.* 
 
 *ఈ కార్యక్రమంలో రైతులు మద్దిబోయిన పంపాద్రి, తోట నరసింహారావు, సూదా లక్ష్మణరావు, వేలాద్రి, బొంతు గోపాల్, తోట రాజారావు, ఇండ్ల కోటేశ్వరరావు, గోన లక్ష్మణరావు, మాగం నరసింహారావు, తోట నరేష్, వీరేందర్, రాగం వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.*