జిల్లా అస్పత్రిలో అక్రమాలపై ప్రత్యేక ఆడిటింగ్

Published: Friday April 22, 2022
విజిలెన్స్ విచారణకు హెచ్ డీఎస్ ఏకగ్రీవ తీర్మానం
2019-21 మధ్య జరిగిన 33 ఉద్యోగుల నియామకాలపై పునః పరిశీలనకు కమిటీ నిర్ణయం
జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి వెల్లడి
వికారాబాద్ బ్యూరో 21 ఏప్రిల్ ప్రజాపాలన :  తాండూరు జిల్లా ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సునీతారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 2019 జూన్ నుంచి 2021 అక్టోబర్ వరకు జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణతో పాటు ప్రత్యేక ఆడిటింగ్ జరిపించాలని కమిటీలో తీర్మానించారు. సమావేశంలో సభ్యులు విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. ఆస్పత్రిలో ఉన్న రూ.30 లక్షల విలువైన పాత సిటీ స్కాన్ మిషన్ నిబంధనలు పాటించకుండా కేవలం రూ.6 లక్షలకే వేరే సంస్థలకు అప్పగించారని బషీరాబాద్ జడ్పిటీసీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పత్రికా ప్రకటనలు ఇచ్చాక వేలం వేయాలని, అలా చేయకుండా అప్పటి సుపురిండెంట్ క్విడ్ ప్రోకో ద్వారా తక్కువకే విక్రయించి బిడ్దర్ నుంచి రూ.3 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. దీనికి డీసీహెచ్ఓ సమాధానం ఇస్తూ దీనిపై గతంలోనే విచారణ జరిగిందని, వీటిలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే పేపర్ ప్రకటన లేకుండా, కలెక్టర్ అనుమతులు, హెచ్ డీఎస్ అనుమతి లేకుండా ఏకంగా 33 మందికి ఉద్యోగాలు కల్పించి పెద్దమొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లు సభ్యులు ఆరోపించారు. అప్పటి రికార్డులను, మినిట్స్ బుక్స్ ను చూపించాలని సభ్యులు పట్టుపట్టగా అవి కనిపించడం లేదని అధికారులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఆస్పత్రి ఉద్యోగ ఏజెన్సీ, శానిటేషన్ ఏజెన్సీల ద్వారా పెద్ద మొత్తంలో డొనేషన్ లు తీసుకున్నారని వాటికి సంబంధించిన రికార్డులు కనిపించకుండా చేశారని సభ్యులు నిలదీశారు. అందులోనూ అప్పటి సుపురిండెంట్ మల్లికార్జున్ స్వామి అక్రమాలకు పాల్పడినట్లు కమిటీ అభిప్రాయపడింది. వీటన్నింటిపై సమగ్ర విజిలెన్స్ విచారణ, ప్రత్యేక ఆడిటింగ్ జరపాలని సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై కమిటీలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. వెంటనే సంగ్రా విచారణ, ఆడిట్ జరిపించాలని జడ్పి చైర్ పర్సన్, హెచ్ డీఎస్ కమిటీ చైర్ పర్సన్ సునీతారెడ్డి జిల్లా అధికారికి ఆదేశించారు. ఆస్పత్రిలో జరిగే అభివృద్ధి పనులకు హెచ్ డీఎస్ అనుమతులు తీసుకోవాలని తీర్మానం చేశారు. హాస్పిటల్ ప్రసవాల్లో రాష్ట్రంలో నే మూడవ స్థానంలో నిలువడంపై కమిటీ వైద్యబృందాన్ని, సుపురిండెంట్ రవిశంకర్ ను అభినందించారు. ఈ సంధర్బంగా జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో వైద్యులు బాగా పనిచేస్తున్నారు. ఇలాగే పనిచేసి కార్పొరేట్ తరహాలో వైద్యసేవలు అందించాలి. ఇక్కడ మన జిల్లా ఒక్కటేబుకాకుండా కర్ణాటక, మహబూబ్ నగర్ నుంచి కూడా రోగులు వస్తుంటారు. వారికి సకాలంలో మంచి వైద్యసేవలు అందించాల. ఆస్పత్రిలో పారిశుధ్యం మరింత మెరుగు పరచాలి. ఇప్పటికే ఆస్పత్రి పతిసరాల అభివృద్ధికి రూ.60 లక్షల జడ్పి నిధులు ఖర్చు చేశామని తెలిపారు. మళ్ళీ కూడా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు సేవాభావంతో విధులు నిర్వహించలన్నారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు లిఫ్టును ప్రారంబించారు. కార్యక్రమాలు అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, డీసీ హెచ్ఓ ప్రదీప్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, సూపరిండెంట్ రవిశంకర్, సభ్యులు రమణబాబు, శ్రీనివాస్ రెడ్డి, శివమోహన రెడ్డి తదితరులు ఉన్నారు.