అసత్య ఆరోపణలు మానుకోవాలి

Published: Friday October 29, 2021
యాదాద్రి అక్టోబర్ 28 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసే వారు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని, అసత్య ఆరోపణలు మానుకొని గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కొమురెల్లి సంజీవరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధి గాంధీనగర్ అభివృద్ధి కోసం గ్రామపాలకపక్షంతో పాటు అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అభివృద్ధి కమిటీలో సభ్యులుగా ఉన్న కొద్దిమంది తనను వ్యక్తిగతంగా విమర్శించడం, అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. 1992 సంవత్సరంలో పేదలకు ఇచ్చిన ప్లాట్లలోని వారు రైతుల భూమి ఆక్రమించారని రైతులు ఆరోపించగా ఫ్లాట్ల క్రమబద్ధీకరణ చేయడం కోసం కమిటీని ఏర్పాటు చేసి రైతులకు ఇంటి నిర్మాణం చేసుకున్నవారికి మధ్యలో రాజీ కుదిర్చడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్లాట్లు కాకుండా ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేసుకున్న వారి నుండి కొద్ది మొత్తంలో అభివృద్ధి కమిటీ సభ్యుల తీర్మానం మేరకు ధర నిర్ణయించడం జరిగిందని, అలా వచ్చిన డబ్బుతో గాంధీనగర్ లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుందని అభివృద్ధి కమిటీ పేరుతో తీర్మానం చేశారని వాటిని ఆమోదించి సంతకం చేసిన కొద్ది మంది సభ్యులు సర్పంచ్ భర్తననే అక్కసుతో తన పైన ఆరోపణలు చేస్తూ తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా గాంధీ నగర్ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అసత్య ఆరోపణలు మానుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ గౌరవ సలహాదారులు బంగారపు లింగ స్వామి, రాపోలు పవన్ కుమార్, కొమ్ము స్వామి, పాలోజు బ్రహ్మచారి,  దంతూరి యాదయ్య, దంతూరి కుమార్, నారి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.