కంటి వెలుగు కార్యక్రమంతో ప్రజలకు కంటి సమస్యలు దూరం ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Friday January 20, 2023

ఆసిఫాబాద్ జిల్లా జనవరి 19 (ప్రజాపాలన) :ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం ద్వారా ప్రజలకు కంటి సమస్యలు దూరం అవుతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం మండలం చిర్రకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎస్పి. సురేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 26 కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, శిబిరాలకు కంటి పరీక్షల కోసం వచ్చే ప్రజలకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శిబిరానికి పరీక్షల కోసం వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి మందులు, అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు శిబిరంలో కంటి పరీక్ష చేయించుకుని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కంటి అద్దాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఉప వైద్యాధికారి సుధాకర్ నాయక్, డి.ఎస్.పి.శ్రీనివాస్, జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, వైద్యాధికారి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.