మధిర కోర్టు నూతన భవన నిర్మాణ పనుల్లో జాప్యంసంవత్సరాలు గడుస్తున్నా స్పందించని అధికారులు, కా

Published: Wednesday November 30, 2022

మధిర నవంబర్ 29 (ప్రజా పాలన ప్రతినిధి) నియోజకవర్గ ముఖ్య కేంద్రమైన మధిరలో నిర్మిస్తున్న కోర్టు నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. రాజకీయ చైతన్యం కలిగిన మధిర ప్రాంతంలో నిజాం కాలం నుండి సుదీర్ఘకాలంగా మధిర కోర్టు ప్రజలకు అందుబాటులో ఉంది. కాలక్రమమైన ఈ భవనం కాస్త శిథిలావస్థకు చేరింది. దీనిపై మధిర బార్ అసోసియేషన్ అనేకసార్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్కు, జిల్లా న్యాయమూర్తికి వినతి పత్రాలు అందజేసి నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరారు.దీంతో నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరు చేశారు. కోర్టు మరమ్మతులు చేపట్టే వరకు అధికారులు మధిర పశువుల ఆసుపత్రి వద్ద తాత్కాలికంగా  కోర్టు ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో కోర్టు భవన నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తావని చెప్పిన కాంట్రాక్టర్ అడ్రస్ లేకుండా పోయారు నిధులు మంజూరై సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు మధిర కోర్టు నూతన భవన పనులు చేపట్టలేదు. మధిర కోర్టుకు నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ గత నెలలో మధిర బార్ అసోసియేషన్ పిలుపుమేరకు న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగారు. ప్రస్తుతం పశువుల ఆసుపత్రిలో నడుస్తున్న కోర్టులో సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కక్షిదారులకు కూడా సరైన వసతులు లేవని వారు వాపోతున్నారు. పశువుల ఆసుపత్రిలో దుర్భర పరిస్థితుల్లో  విధులు నిర్వహించాల్సి వస్తుందని న్యాయవాదులు వాపోతున్నారు. నూతన కోర్టు నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ నూతన భవనం నిర్మాణం చేపట్టానికి ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థం కావటం లేదని న్యాయవాదులు పేర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎందుకు స్పందించట్లేదు అని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. పశువుల ఆస్పత్రి కోర్టు భవనంలో విధులు నామమాత్రంగా నిర్వహిస్తూ మిగతా పనులన్నీ శిథిలావస్థకు చేరిన కోర్టులోనే నిర్వహిస్తున్నట్లు న్యాయవాదులు పేర్కొన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నూతన కోర్టు నిర్మాణ పనులను  చేపట్టాలని బార్ అసోసియేషన్ కోరారు.