ధరణి సమస్యల పరిష్కారంలో మెరుగైన ఫలితాలు

Published: Tuesday April 05, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 04 ఏప్రిల్ ప్రజాపాలన : ప్రజావాణిలో వచ్చిన ధరణి సమస్యలను ప్రాధాన్యతతో చాలా వరకు పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరములో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 150 మందికి సంబంధించిన ప్రజా సమస్యల దరఖాస్తులను జిల్లా కలెక్టర్ నిఖిల స్వీకరించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారం మెరుగు పడుతుందన్నారు. ధరణి సమస్యల పరిష్కారంలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, గతం కన్న మండలాల వారిగా వందకు మించి పెండింగ్ సమస్యలు లేవని కలెక్టర్ తెలిపారు. కొన్ని సమస్యల పరిష్కారం తమ పరిధిలో లేని వాటిని సీసీయల్ఏకు పంపిందుకు తహసీల్దార్లు ప్రతిపాదించాలన్నారు. ప్రతి సోమవారం వచ్చిన దరఖాస్తుల లిస్ట్ ను తహసీల్దార్లకు పంపడం జరుగుతుందని, అట్టి దరఖాస్తులను పరిశీలించి ఆర్డిఓ ల ద్వారా జిల్లా కలెక్టర్ కు పరిష్కారం కొసం పంపించాలన్నారు. ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి బుధవారం మండల స్థాయిలో గురువారం డివిజన్ స్థాయిలో జరిగే ప్రజావాణిలో ప్రజల నుండి అందిన దరఖాస్తులను పరిశీలించాలని ప్రజలు కార్యాలయాల చుట్టు తిరుగకుండా చూడాలన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ధరణి సమస్యలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన సమస్యల సత్వర పరిష్కారం కొసం ఆయా శాఖల అధికారులకు ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పంపుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి, సర్వే అండ్ ల్యాండ్ ఏడి రాంరెడ్డి, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.