అకాల వర్షానికి నెలకొరిగిన మొక్కజొన్న ,మామిడి

Published: Saturday April 01, 2023
బోనకల్, మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని
శుక్రవారం సాయంత్రం విపరీతంగా వచ్చిన గాలి వర్షానికి చిరునోముల, చొప్పకట్లపాలెం గ్రామాలలో మామిడి, మొక్కజొన్న పంట నేలకొరిగాయి. పండించిన రైతులకు అధిక నష్టం వాటిల్లినది. చేతికొచ్చిన పంట అకాల వర్షానికి రాలిపోయినందున రైతులు ఆవేదన చెందారు.ప్రస్తుత సీజనులో అంతంతమాత్రంగా ఉన్న మామిడి పంటకు శుక్రవారం వీచిన గాలులు, అకాల వర్షం నష్టాన్ని కలిగించాయి. చాలా తోటల్లో కాయలు ఇంకా పక్వానికి రావాల్సి ఉంది. మార్కెట్‌లో కూడా సరైన ధర లేకపోవటంతో ఈ నెల రెండో వారంలో కాయలు కోసి మార్కెట్‌కు తరలిస్తే ధర వస్తుందని రైతులు ఆశపడుతున్న తరుణంలో అకాల వర్షం, గాలులతో మామిడి కాయలు నేలకొరిగాయి. 50 శాతం కాయలు గాలులకు రాలినట్లు రైతులు తెలిపారు. రాలిన మామిడి కాయలను ఏరే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. కనీసం కూలీ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితులు కనిపించటం లేదని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా కురిసిన వర్షాల వల్ల చెట్లకు ఉన్న కాయల్లో నాణ్యత పెరుగుతుందని, ఫలితంగా ధర కూడా వస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు. అకాల వర్షం రైతులకు నష్టాన్ని కలిగించింది. వ్యవసాయ శాఖ, రెవిన్యూ శాఖ అధికారులు నేలకొరిగిన మొక్కజొన్న, మామిడి పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.