అసలైన లబ్ధిదారులకే ఇళ్లు కేటాయించాలి అక్రమాలు జరిగితే సహించేది లేదు "కాంగ్రెస్ పార్టీ"

Published: Wednesday August 24, 2022
 అశ్వారావుపేట (ప్రజా పాలన ప్రతినిధి): అశ్వారావుపేట  పట్టణంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు అసలైన లబ్ధిదారులకే కేటాయించాలని లేనిచో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  అశ్వారావుపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట మండల కమిటీ నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవరావు, వగ్గెల పూజ, ఎంపీటీసీలు వేముల భారతి, సత్యవరపు తిరుమల, తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇల్లు లేని ప్రతి పేదలకు ఇల్లు కట్టి ఇవ్వడం జరిగిందని,  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వేలాదిమంది ఇళ్లు లేని పేదలు ఉన్న అశ్వారావుపేటలో కేవలం 20 ఇళ్లు కట్టించి ప్రజలకు ఆశ చూపించారని, డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం జరిగి సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదని, దీంతో డబల్ బెడ్ రూమ్ ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా, మందుబాబులకు  అడ్డాగా మారాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. 
డబల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులకు అందజేయడంలో  ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని, ఇంతవరకు అర్హులైన లబ్ధిదారుల లిస్టు ప్రభుత్వం తయారు చేయలేక పోయిందని దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వానికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, పేదల పాలిట ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధం అవుతుందన్నారు. అనేకచోట్ల నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కాంట్రాక్టర్ల దగ్గర కాసులకు కక్కుర్తి పడి నాణ్యత లోపాలతో నిర్మించారని, వర్షాకాలం దాటికి అనేక చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కురుస్తున్నాయని, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని, రోడ్లు కరెంటు సౌకర్యాలు ఇంకా పూర్తి కాలేదని ప్రభుత్వ అజమాయిషి లేకపోవడం మూలంగా కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారన్నారు. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, నిజమైన లబ్ధిదారులకు కాకుండా అనేక చోట్ల అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో అనర్హులకు  డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించారని విమర్శించారు. అశ్వారావుపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో అర్హులైన లబ్ధిదారులనే ఎంపిక చేసి డబల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.  లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బూసి పాండు, బండారు మహేష్, అశ్వారావుపేట పట్టణ అధ్యక్షులు జల్లిపల్లి దేవరాజ్, చిన్నంశెట్టి రామకృష్ణ, మేక అమర్నాథ్, నరదల సర్వేశ్వరరావు,ములగిరి కృష్ణ. తలారి జేమ్స్, స్థానిక మహిళలు బండారు వెంకటలక్ష్మి , గుమ్మడి కృష్ణవేణి, దాసరి మౌనిక, మామిళ్ళ రమణ, సజ్జ సత్యవతి, ఎస్కే నసీమా, గురింద చంద్రమ్మ, దాసరి మంగాదేవి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.