పర్యావరణ పరిరక్షణే ప్రథమ లక్ష్యం : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Friday October 01, 2021
వికారాబాద్ బ్యూరో 30 సెప్టెంబర్ ప్రజాపాలన : పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, బట్ట సంచులను వినియోగించాలని జిల్లా కలెక్టర్ నిఖిల ప్రజలను కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా స్వచ్ఛత ప్రచార రథంను జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ చెత్తను అనాలోచితంగా ఎక్కడ పడితే అక్కడ వేయడం వలన దోమలు, ఈగలు ప్రబలి డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు వ్యాపించడమే కాకుండా పరిసరాలు అపరిశుభ్రంగా మారుతాయన్నారు.  గ్రామాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మనందరిదని అన్నారు. గ్రామాలలో ప్రతి ఇంటికి తడి, పొడి చేత్త వేరువేరుగా వేయడానికి రెండు రంగుల చేత్త బుట్టలు ఇవ్వడం జరుగుతందన్నారు. ప్రతిరోజు ఇంట్లో వెలువడే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మీ ఇంటి వద్దకు వచ్చే గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలన్నారు. ఇండ్లలో వాడిన నీటిని పరిసరాల్లో నిలువకుండా ఇంకుడు గుంతలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముద్రించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.
జిల్లాలో అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలను గుర్తించాలి : 
జిల్లాలో అక్రమ నిర్మాణాలు, లేఔట్ లను గుర్తించేందుకు సంబంధిత అధికారులు క్షేత్రస్తాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి TS b pass టాస్క్ ఫోర్స్ కమిటీ మొదటి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు గృహ నిర్మాణాలకు సంబంధించి ఆన్-లైన్ ద్వారా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అనుమతులు ఇచ్చారని సంబంధిత మున్సిపల్ కమీషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు TS b pass క్రింద గృహ నిర్మాణాలకు సంబంధించి ఆన్ - లైన్ లో 910 దరఖాస్తులు అందాయని, క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం 548 గృహ నిర్మాణాలకు ఆమోదించడం జరిగిందని, 202 దరఖాస్తులు వివిధ కారణముల వల్ల తిరస్కరించడం జరిగిందని మిగితా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని కమిటీ సభ్యులు కలెక్టర్ కు తెలియజేసినారు. అలాగే జిల్లాలో 45 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు కమిటీ సభ్యులు తెలియజేసినారు. ఈ సందర్బంగా కలెక్టర్ స్పందిస్తూ గృహ నిర్మాణాల అనుమతులకు, అక్రమ లేఔట్ లు, అక్రమ నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించాలని అధికారులను సూచించారు. ఇట్టి సమావేశం ప్రతి 15 రోజులకు ఒక సారి నిర్వహించాలని సభ్యులకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య (లోకల్ బాడీ), మోతిలాల్,  జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డి ఆర్ డి ఓ కృష్ణన్, సిబ్బంది, సమావేశంలో జిల్లా SP నారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, వికారాబాద్, తాండూర్ ఆర్ డి ఓ లు ఉపేందర్ రెడ్డి, అశోక్ కుమార్ లు, మున్సిపల్ కమీషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, R&B, ఇరిగేషన్ శాఖల ఇంజనీర్లు జిల్లా ఫైర్ ఆఫీసర్, పరిశ్రమల శాఖ AD తదితరులు పాల్గొన్నారు.