28న భద్రాచలం రామన్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము .. భద్రాచలం విచ్చేయుచున్న రెండవ రాష్ట్రపతి..... సర

Published: Tuesday December 27, 2022
బూర్గంపాడు ( ప్రజా పాలన.)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 28వ తేదీన భద్రాచలంలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ బీపీఎల్ పాఠశాల ప్రాంగణంలోని మూడు హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. సారపాక, భద్రాచలంలో లాడ్జీలు అద్దెకివ్వద్దని, దుకాణాలను మూసివేయాలని అధికారులు ఇప్పటికే నోటిసులు జారీ చేశారు.
రాష్ట్రపతి . పర్యటన రోజున భద్రాచలం, సారపాకల్లో 144వ సెక్షన్ ను విధించాలని, రెండు పట్టణాలను సర్వాంగసుందరంగా అలంకరించాలని సంబంధిత తహసీల్దార్లను కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు.కాగా భద్రాచలంలోని రామాలయం పరిసరాల్లో రహదారిపైకి ఉన్న రేకుల షెడ్లను సిబ్బంది తొలగించారు. రామాలయ ప్రాంగణంలో రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా రూపొందించిన గ్రీన్ రూములకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ బాక్సును ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య నిపుణులను అందుబాటులో ఉంచనున్నారు. రామాలయాన్ని సందర్శించిన సమయంలో దేవస్థానంలో వైదిక పరిపాలన సిబ్బంది నిర్దేశిత సంఖ్యలోనే అనుమతించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎవరెవరు ఏ ప్రాంతంలో విధులు నిర్వహిస్తారనేదానిపై వివరాలను దేవస్థానం అధికారుల నుంచి జిల్లా అధికారులు సేకరించారు. ఆలయ దర్శనం అనంతరం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.50 కోట్లతో ప్రసాద్ పథకం కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. భద్రాచలం విచ్చేయుచున్న రెండో రాష్ట్రపతిగా ద్రౌపతి మురుము నిలిచారు .గతంలో 1965 సంవత్సరంలో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గోదావరిపై నిర్మించిన వంతెనను ప్రారంభించినందుకు వచ్చారు.రాష్ట్రపతి రాకను పురస్కరించుకొని ఇప్పటికే భద్రాచలం, సారపాక ప్రాంతాల్లో సాయుధ పోలీసుల తనిఖీలు, గస్తీలు భారీగా పెరిగాయి. రామాలయం చుట్టూ సాయుధ పోలీసు బలగాలను ఇప్పటికే మోహరించారు. రాష్ట్రపతి పర్యటన సమయంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆమె వెంట రానుండగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రానున్నట్లు దేవస్థానం అధికార వర్గాలకు సమాచారం అందినట్లు తెలిసింది. కాగా రాష్ట్రపతి భద్రాచలంలో రామాలయం దర్శనం అనంతర కార్యక్రమాల తరువాత ఆదివాసీలతో సుమారు 40 నిమిషాల్లోపు జరిగే ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు ఘనంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 28వ తేదీన రాష్ట్రపతి భద్రాచలం పర్యటన పురస్కరించుకుని విధులు కేటాయించిన జిల్లా అధికారులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రొటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు డిసెంబర్ 26లోగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మహబూబాబాద్ , ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మించిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల ప్రారంభోత్సవాలు వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రపతి ప్రారంభిస్తారని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంచాలని బీఎస్ఎన్ఎల్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని..ప్రత్యామ్నాయంగా జనరేటర్ సిద్ధంగా ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీపీవో రమాకాంత్, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్, ఆర్ అండ్ బీ ఈఈ బీమ్లా, పంచాయితీరాజ్ ఈఈ సుధాకర్, వైద్యాధికారులు డాక్టర్ శిరీష, రవిబాబు, కొత్తగూడెం, భద్రాచలం ఆర్టీవోలు స్వర్ణలత, రత్న కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ద్రౌపతి ముర్ము  ఒడిస్సా రాష్ట్రానికి చెందినవారు 1997లో కౌన్సిలర్ గా తన రాజకీయ ప్రస్తానని ప్రారంభించి అంచలంచలుగా ఎదిగి బిజెపి ఎస్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ సభ్యురాలుగా పనిచేశారు. 2015 నుండి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. జులై 26 ,2022న భారత 15వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.