మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరికి దక్కేనో?*

Published: Thursday January 05, 2023
మధిర జనవరి 1 (ప్రజా పాలన ప్రతినిధి
మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కాలం ముగియటంతో ఆ పదవిని పొందేందుకు పలువురి బీసీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం ప్రభుత్వం గతంలో తీసిన రిజర్వేషన్ల ప్రకారం బీసీ సామాజిక వర్గానికి మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ రిజర్వు చేయబడింది. ఇప్పుడు వరకు మధిర మండలానికి చెందిన చిత్తారి నాగేశ్వరావు మధిర మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. ఈసారి మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని బోనకల్ మండలానికి కేటాయిస్తారని, గతంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ఆ మండలానికి చెందిన బంధం శ్రీనివాసరావుకి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే బంధం శ్రీనివాసరావుకి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తే మండలంలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆ మండలానికి చెందిన మెజార్టీ నాయకులు బంధం నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. నియోజకవర్గంలో బీసీల్లో అత్యధిక ఓట్లు కలిగిన గౌడ సామాజిక వర్గానికి ఈసారి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని ఆలోచనలో కమల్ రాజు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చైర్మన్ పదవి పొందేందుకు పావులు కదుపుతున్నారు. ఏఏంసి చైర్మన్ పదవిని బంధం శ్రీనివాసరావు ఇస్తున్నారని ప్రచారంలోకి రావడంతో అదే మండలానికి చెందిన ఇటీకాల శ్రీనివాసరావు పలు టిఆర్ఎస్ నాయకులు కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. ఎర్రుపాలెం మండలం నుండి టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పంబి సాంబశివరావు సైతం రేసులో ఉన్నారు. మధిర మండలం నుండి రంగిశెట్టి కోటేశ్వరావు వైవి అప్పారావుతో పాటు అరిగే శ్రీనివాసరావు ఉన్నారు. మరో 10 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సమర్థుడికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాల్సి ఉంది. ఆశావాహులు ఎక్కువ ఉండటంతో ఒకరికి ఇస్తే మరొకరు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది.ఈ పరిస్థితుల్లో ఎన్నికలు అయిపోయే వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తీ చేయకుండా ఉంటేనే మంచిదని టిఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన నాయకులు తమ అభిప్రాయాన్ని కమల్ రాజు దృష్టికి తీసుకెళ్లిన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద నామినేటెడ్ పదవి ఐన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తీ చేస్తారా? భర్తీ చేస్తే ఎవరికి ఇస్తారు? లేక ఎన్నికల వరకు వాయిదా వేస్తారా? అనేది త్వరలోనే తేటతెల్లం కానుంది.