ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుదాం... మానవాళి మనుగడకై కృషి చేద్దాం

Published: Monday June 06, 2022
వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూన్ 05 జనంసాక్షి : 
మానవాళి మనుగడ ప్రశ్నార్ధక మవుతున్న సందర్భంలో మనమంతా కలిసికట్టుగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ముఖ్యంగా ప్రతి మనిషికి తన జీవితంలో ఒక పెళ్లి రోజు ఒక పుట్టినరోజు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పర్యావరణ దినోత్సవానికి కూడా అదే స్థాయిలో ప్రాముఖ్యతనిచ్చి విరివిగా చెట్లు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడం, కాలుష్య కారకమైన వస్తువుల వినియోగాన్ని అరికట్టడం మొదలైన అనేక పర్యావరణహిత కార్యక్రమాలు నిర్వహించవలసిన ఆగత్యం ఏర్పడింది. భూతాపం రోజురోజుకు పెరుగుతున్న కారణంగా హిమనీ నదులు కరగడం వల్ల పర్యావరణ సమతౌల్యం లోపించి తీవ్రమైన అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాము. మానవాళి మనుగడకు ప్రమాదం వాటిల్లకుండా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన చుట్టూ ఉన్న ప్రకృతిని, పరిసరాలను, పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన గురుతరమైన బాధ్యత మనందరిపై ఉన్నది. పర్యావరణ పరిరక్షణలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భూ ప్రపంచంపై మానవ మనుగడే ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనమందరం మానవులుగా స్పందించి మన మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా మసలుకోవాలని అందుకు తగిన కార్యాచరణ రూపొందించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములుగా పునరంకితం అవుతారని ఆశిస్తున్నాను.