చెక్ డ్యామ్ పనులను మే 15 వరకు పూర్తవ్వాలి

Published: Thursday March 30, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 29 మార్చి ప్రజాపాలన :  చెక్ డ్యామ్ నిర్మాణ పనులను వేగవంతం చేసి మే 15 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తాండూర్ మండలం, ఎల్మకన్నె గ్రామంలోని కాగ్న నదిపై రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులను ఇరిగేషన్
 ఇఇ సుందర్, ఏఇ సాయిలతో కలిసి పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో వచ్చే నీటిని వృధా కాకుండా నిలువ చేసి, భూగర్భ జలాలను పెంపొందించేందుకు చేపట్టిన పనులను మే 15 వరకు పూర్తి చేస్తే ప్రజలకు మేలు చేసిన వారమవుతామన్నారు.  కాగ్న నది పరివాహక ప్రాంతాలలోని మరో 6 చెక్ డ్యాం పనులను చేపట్టడం జరుగుతుందని, ఇట్టి పనులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనైనా మే 15 వరకు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఎల్మకన్నె  గ్రామంలో విస్తృతంగా పర్యటించి హరితహారం నర్సరీ, మినీ పల్లె ప్రకృతి వనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాల, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, అవెన్యూ ప్లాంటేషన్ లను పరిశీలించారు.  ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో గణితంలో విద్యార్థుల సామర్ధ్యాన్ని పరిశీలించి అసంతృప్తి వ్యక్తపరిచారు.  విద్యార్థులు గణితంలో చాలా వెనుకబడి ఉన్నారని, పాఠశాల గణిత ఉపాధ్యాయుడు హర్షవర్ధన్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.  అలాగే పాఠశాలలోని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడం వల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి సరితకు మెమో జారీ చేయవలసిందిగా ఎంపీడీవోను ఆదేశించారు. హరితహారం నర్సరీని పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ, అవసరం మేరకు మొక్కల సంఖ్యను పెంచుకునే విధంగా నర్సరీ స్థలాన్ని పెంచుకొని బౌండరీ ఏర్పాటు చేయాలన్నారు.  నర్సరీకి గేటు,  ఫెన్సింగ్ సక్రమంగా ఏర్పాటు చేయాలని సూచించారు.  5 ఎకరాలలో ఏర్పాటు చేసిన మినీ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు.  మినీ పల్లె ప్రకృతి వనం అభివృద్ధికి సి బి ఎఫ్ నిధుల నుండి 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. గ్రామంలో కలియతిరుగుతూ ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ క్రింద 10 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను పరిశీలించారు.  విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు తప్పనిసరిగా ఫెన్సింగ్ చేయాలని సూచించారు.  ఫెన్సింగ్ లేని కారణంగా మనుషులు, పశువులకు ప్రాణహాని జరిగే అవకాశం ఉందని, ఫెన్సింగ్ లేని ట్రాన్స్ఫార్మర్లకు వెంటనే ఫెన్సింగ్ పనులు చేపట్టాలన్నారు.  ట్రాన్స్ఫార్మర్ల వద్ద పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలను గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో వెంటనే తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.  వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా నీటి  సరఫరా ప్రతి ఇంటికి సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు. నల్లాలకు బిగించిన వాల్స్ తొలగించడం, మోటార్లు బిగించే వారిపై ఐదు వేల  రూపాయల జరిమానా విధించాలని అన్నారు.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వ్యక్తికి 100 లీటర్ల చొప్పున నీరు అందేలా చూడాలని మిషన్ భగీరథ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా సందర్శించి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో ఏఎన్ఎం, ఆశా వర్కర్ల సేవలు ఎంతో ముఖ్యమైనవని గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మంచి పౌష్టిక ఆహారం అందించాలన్నారు.  సాధారణ ప్రసవాలు జరిగే విధంగా గర్భిణీలకు నిరంతరం పరీక్షలు నిర్వహించాలని అన్నారు.  అంగన్వాడి కేంద్రాలలోని పిల్లలకు ప్రతిరోజు మెనూ ప్రకారం మంచి భోజనాలు  అందించాలని, అంగన్వాడి కేంద్రంలో విద్యుత్తు సదుపాయంతో పాటు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు.  స్థానిక ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులతో గణితం పై లెక్కలు చేయించి వారి సామర్ధ్యాన్ని పరిశీలించారు.  ఆశించిన స్థాయిలో విద్యార్థులు సమాధానం చెప్పలేకపోవడంతో గణిత ఉపాధ్యాయుడు హర్షవర్ధన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.  పాఠశాలలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో కలెక్టర్ మండిపడ్డారు.  గ్రామపంచాయతీ సిబ్బందితో పరిశుభ్రత పనులు చేపట్టకపోవడంతో గ్రామ కార్యదర్శి  సరితకు మెమో జారీ చేయవలసిందిగా ఎంపీడీవోను ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారంగా మంచి భోజనం అందించాలని అన్నారు.  విద్యార్థులకు పాఠశాలలో మంచి విద్యతో పాటు నాణ్యమైన మంచి భోజనం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం కల్పించాలని సూచించారు.
వైకుంఠధామాన్ని పరిశీలించి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని పరిసరాలలో మొక్కలు నాటాలని సూచించారు.  డంపింగ్ యార్డ్ ను పరిశీలించి చెత్త సేకరణ సరిగా నిర్వహించడం లేదన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలకు చిత్త సేకరణ కోసం ట్రాక్టర్లను మంజూరు చేసిందని, ట్రాక్టర్ల ద్వారా ప్రతిరోజు తడి పొడి చెత్త సేకరణ నిర్వహించి డంపింగ్ యార్డ్లకు తరలించాలని, డంపింగ్ యార్డులలో సెగ్రికేషన్ పనులు చేపట్టాలన్నారు.  గ్రామంలోని రోడ్లకు ఇరువైపుల నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను కలెక్టర్ పరిశీలించారు.  నాటిన మొక్కలకు సామ్రక్షించేందుకు గాను సపోర్టుగా కర్రలను  పెట్టాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు గ్రామాలలో మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, తడి పొడి చెత్త సేకరణ,  అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.  జూన్ మాసంలో నిర్వహించే హరితహారం కార్యక్రమంలో అవెన్యూ ప్లాంటేషన్ క్రింద మూడు వరుసలలో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.  ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో రెండు కిలోమీటర్ల ఫార్మేషన్ రోడ్డు పనులను చేపట్టాలన్నారు.  ఈ పర్యటనలో తాండూర్ తహసిల్దార్  చిన్న అప్పలనాయుడు, ఎంపీడీవో సుదర్శన్ రెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి శంకర్ నాయక్, పంచాయతీరాజ్ డిఇ వెంకట్ రామ్, ఎంపీఓ, ఏపీఓ, గ్రామ కార్యదర్శి సరిత, సర్పంచ్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.