*ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు మాతా శిశు కేంద్రాన్ని నిర్మించాలి*

Published: Monday January 09, 2023

మంచిర్యాల టౌన్, జనవరి 09, ప్రజాపాలన: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు మాతా శిశు కేంద్రాన్ని నిర్మించాలని మంచిర్యాల లోని రహదారులు,  భవనాలు శాఖ అతిథి గృహం స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులను సత్వరమే నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ సాగర రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ డిమాండ్ చేశారు.   ఆదివారం ఐబి స్థలంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను ప్రేమ్ సాగర్ రావు, సురేఖ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా ప్రధాన కేంద్రంలో ప్రభుత్వ మాత శిశు కేంద్రం నిర్మించకుండా మార్కెట్ సముదాయం నిర్మించడంలో ఔచిత్యం  ఏమిటని వారు ప్రశ్నించారు. మాత శశు కేంద్రాన్ని గోదావరి నది ఒడ్డున నిర్మించగా వర్షాకాలంలో బ్యాక్ వాటర్ తో ఆసుపత్రిలోకి నీరు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. అయినప్పటికీ ఆసుపత్రిని తిరిగి అందులోనే తిరిగి ప్రారంభించాలని ఏర్పాటు చేయడం శోచనీయమని వారన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు మాతా శిశు కేంద్రాన్ని నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వారు గుర్తు చేశారు.  మొండి పట్టుదలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ను చేపట్టి తీరాలని నిర్ణయిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో  సహించబోమని వారు హెచ్చరించారు. కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి నిర్మాణం పనులను నిలిపివేస్తామని వారు స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ కూడా పరిస్థితిని అర్థం చేసుకొని నిర్మాణం పనులు నిలిపివేయాలని లేకపోతే న్యాయస్థానం ఆశ్రయిస్తే పెట్టిన పెట్టుబడి నిలిచిపోయి బిల్లులు చెల్లింపు కూడా రాదని వారు సూచించారు. మాత శిశు కేంద్రం ఐబీ  స్థలంలో నిర్మించడం వల్ల నిరుపేదలకు ఎంతో దగ్గరగా, రవాణా భారంలేకుండా సౌకర్యం గా  ఉంటుందని వారు అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాలను గాలికి వదిలేసాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తారని బిఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేయడానికి వారు ఆక్షేపించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రజా సంక్షేమ పథకాలు అమలులో జరిగి తీరుతాయని ఈ విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు తో పాటు కౌలు రైతులకు కూడా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామని వారు ప్రకటించారు. అలాగే గతంలో 145 రూపాయలకే 9 రకాల నిత్యావసర సరుకులను రేషన్ దుకాణం ద్వారా గతంలో పంపిణీ జరిగిందని మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంకా నిత్యవసర సరుకులను పెంచి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వారు భరోసా ఇచ్చారు. ఈ  కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పాలయ్య, డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ సంజీవ్, మజీద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బానేష్,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.