మండల కేంద్రంలో ఐదు షాపుల్లో ఓకే రాత్రి వరుస దొంగతనాలు

Published: Thursday January 05, 2023
బోనకల్, జనవరి 4 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో ఒకే రాత్రి ఐదు షాపులలో వరసగా ఓ వ్యక్తి దొంగతనాలకు పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో పలు షాపులు ఉన్నాయి. మొదటగా బుక్య శ్రీనివాసరావు ఫ్యాన్సీ షాపులోకి దొంగ చోరీకి పాల్పడ్డాడు. ఇంటి వెనక గల తలుపు యొక్క తాళం రింగు ని కోశాడు. ఆ తర్వాత ఫ్యాన్సీ షాపులోకి ప్రవేశించాడు. ఫ్యాన్సీ షాప్ లో గల క్యాష్ కౌంటర్ లో గల 30 వేల రూపాయల నగదును దోసుకెళ్లాడు. ఫాన్సీ షాపులో గల వస్తువులను చిందరవందరగా పడేశాడు. ఆ తర్వాత రెండు షాపులను వదిలేసి పర్సనబోయిన వీరభద్రం కు చెందిన హోటల్ లోకి ప్రవేశించాడు. ఇంటి వెనక గల తలుపు యొక్క తాళము వేసే రింగుని కోసి హోటలలోకి ప్రవేశించాడు. హోటలలో గల బీరువా తాళాన్ని పగలగొట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. దీంతో పక్కనే రెండు షాపులను వదిలేసి కలవల సుబ్బారావు ఫ్యాన్సీ షాపులోకి వెళ్ళాడు. షాపు వెనుక గల తాళం వేసే రింగుని కోశాడు. షాపు లోపలికి ప్రవేశించాడు. సుమారు 3 వేల రూపాయల నగదును దోసుకెళ్లాడు. మూడు వేల రూపాయల గల స్థలంలోనే కింద భాగంలో మరో 19 వేల రూపాయలు ఉన్నప్పటికీ వాటిని ముట్టుకోలేదు. ఆ తర్వాత పక్కనే గల స్టీల్ సామాను షాపులో కి తలుపు తాళం వేసే రింగుని కూడా కోశాడు. తలుపుని కింద భాగం కొంత పగలగొట్టాడు. లోపలికి ప్రవేశించాడు. క్యాష్ కౌంటర్లో గల 15 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లాడు. ఆ పక్కనే గల కిరాణా షాపులోనికి వెళ్లటానికి విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే ఈ కిరాణా షాప్ కి బయట తాళం వేసి ఉండకపోవడంతో లోపలికి ప్రవేశించలేకపోయాడు. బంధం దుర్గారావు కు చెందిన స్టీల్ సామాన్ షాపు బయట ఉంచిన కాటాను కూడా ఎత్తుకెళ్లాడు. ఈ వరుస దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటుంది. దొంగతనాలకు పాల్పడిన యువకుడు పక్కపక్కనే గల ఇల్లా మీద నుంచి దిగుతూ దొంగతనాలకు పాల్పడటం విశేషం. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ముందుగానే టాటా ఏసీ ని తీసుకొని వచ్చినట్లు అందులో ఐదారు గురు ఉన్నట్లు అంటున్నారు. కాలసాని టీ షాప్ కు చెందిన ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో మూత్రానికి లేవగా ఈ టాటా ఏసీ కనిపించినట్లు తెలిపాడు. దొంగతనానికి పాల్పడిన యువకుడు షాపుల వెనక గల తలుపులను ఒకే రకంగా కోసి లోపలకు ప్రవేశించడం విశేషం. ముందుగానే దొంగ తన వెంట బ్లేడు తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. సంఘటన స్థలాలను బోనకల్ ఎస్సై తేజావత్ కవిత పరిశీలించారు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒకే రాత్రి వరుస షాపులలో దొంగ చోరీలకు పాల్పడటం మండల కేంద్రంలో సంచలనంగా మారింది.