నిరుద్యోగుల సమస్యను తీవ్ర సమస్యగా పరిగణించాలి ** వైయస్సార్ టిపి ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినత

Published: Thursday April 13, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 12(ప్రజాపాలన,ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల సమస్యలను తీవ్ర సమస్యలుగా పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కారం నిర్ణయాలు తీసుకోవాలని వైయస్సార్ టిపి జిల్లా అధ్యక్షులు భూక్యా గోవింద్ నాయక్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యల కోసం బుధవారం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో నియామకాలు జరగకపోవడం దారుణం అన్నారు. 2014 లో రాష్ట్రం ఆవిర్భవించాక నిరుద్యోగుల సమస్యలపై ఇలాంటి కార్యచరణ రూపొందించలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం యువత తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సాధించుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, దీనితో అనేకమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు గుడి కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేపర్ లీకేజీలు, లిక్కర్, కబ్జాలు, మాఫియాల రాజ్యం, కొనసాగుతుందని ఎద్దేవ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై వైయస్సార్ టిపి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యచరణ రూపొందించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టిపీ  నాయకులు పెద్దపెళ్లి కిషన్ రావు, నాగోరావ్,షాకీర్, వహీద్ ఖాన్, సందీప్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.