కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల ఎంతో అవగాహన కలిగిన నాయకుడు పిల్లలమర్రి సిపిఎం రాష్ట్ర కార్యదర్

Published: Friday March 10, 2023
 బోనకల్, మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని ముష్టికుంట గ్రామంలో అమరజీవి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు సంస్మరణ సభ సిపిఎం ముష్టికుంట గ్రామ కమిటీ కన్వీనర్ దొప్పకొరివి వీరభద్రం అధ్యక్షతన బుధవారం జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి తమ్మినేని వీరభద్రం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ,రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, చింతలచెరువు కోటేశ్వరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల ఎంతో అవగాహన కలిగిన నాయకుడని కొనియాడారు. రక్తసంబంధానికి లేని నిబద్ధత కమ్యూనిస్టులకు ఉంటుందన్నారు.పిల్లలమర్రి జీవితం మనందరికీ ఆదర్శం కావాలని ,ఆయన ఆదర్శ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ప్రస్తుతం రాజకీయాలు మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముద్దుబిడ్డ అధాని అని అన్నారు. కరానా సమయంలో అన్ని దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. కానీ కమ్యూనిస్టు దేశాలు కరోనాను జయించి ఆర్థికంగా నిలదొక్కుకున్నాయన్నారు. కమ్యూనిస్టు దేశాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. భారతదేశంలో కమ్యూనిస్టులకు మంచి రోజులు వచ్చాయన్నారు. డబ్బు రాజకీయాలకు త్వరలోనే గుణపాఠం జరుగుతుందన్నారు. బిజెపి ప్రభుత్వం మతోన్మాదం పేరుతో పరిపాలన చేస్తూ దేశ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. భారతదేశాన్ని నాశనం చేయడమే బిజెపి తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తన విధానాలను బట్టి అర్థమవుతుందన్నారు. మతోన్మాద శక్తులను అధికారానికి దూరంగా ఉంచకపోతే భారతదేశం నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రజా వ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టు పార్టీలు పిలుపులు ఇస్తే ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేసే వారన్నారు. కానీ ప్రస్తుతం డబ్బు రాజకీయాల ప్రభావంతో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పిలుపులు విస్తుంటే ప్రజలు కదిలి రావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రజా పోరాటాలలోకి వచ్చినప్పుడు డబ్బు రాజకీయాలు పోతాయన్నారు. కమ్యూనిస్టులు మార్పులకు అనుగుణంగా పోరాట మార్గాలను రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిస్టులు అందరూ ఐక్యంగా ఉండాలని తమ విధానం అన్నారు. బిజెపిని గద్దించటానికి సిపిఎం నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. ప్రస్తుత ఎన్నికలలో కమ్యూనిస్టులకు డబ్బులు లేవు కదా పోటీ ఎలా చేస్తారని కొంతమంది అంటున్నారని డబ్బు లేకపోయినా ప్రజలే తమకు అండ అని ఆ విధంగానే ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. బిజెపి అనుసరిస్తున్న మత తత్వ విధానాలు రాజ్యాంగ వ్యవస్థలు అన్నింటిని సర్వనాశనం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఏ ఆశయాల సాధన కోసం తన జీవితాంతం ఉపాధ్యాయ రంగంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారో మనమందరం అదేవిధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పిల్లలమర్రి కుటుంబం మొత్తం సిపిఎం లోనే కొనసాగే విధంగా తయారుచేయటం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ముష్టికుంట పార్టీ శ్రేణులు పనిచేయాలని కోరారు.
 
 పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ.....
 
పిల్లలమర్రి ఊడలమర్రి లాగా విస్తరించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. పిల్లలమర్రి కుటుంబం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహిస్తున్నారని అభినందించారు. పిల్లలమర్రి నాకు పాఠశాలలో గురువే కాక రాజకీయ గురువు కూడా అని అన్నారు. పాఠశాలలోనే తనను ఉద్యమాలలో పాల్గొనే విధంగా ప్రోత్సాహం ఇచ్చారన్నారు. పిల్లల మర్రి కుటుంబానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. తనను రాజకీయ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనేందుకు అవసరమైన సహాయ సహకారాలు ఉపాధ్యాయులుగా ఉన్న సమయంలోనే అందించారన్నారు. ముష్టికుంట గ్రామంలో రాజకీయాలలో కీలకపాత్ర పోషించారన్నారు. పార్టీ అభివృద్ధిలోనూ అనేక ఎన్నికల విజయాలలోనూ పిల్లల మర్రి వెంకటేశ్వర్లు పాత్ర మరువలేనిది అన్నారు. పిల్లలు మరి వెంకటేశ్వర్లు ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారని, ఆయన స్ఫూర్తితో మనమందరం ముందుకు సాగాలని కోరారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, చింతలచెరువు కోటేశ్వరరావు, బండి పద్మ, దొండపాటి నాగేశ్వరరావు, టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు, చిదిరాల వెంకటేశ్వర్లు, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, సొసైటీ మాజీ అధ్యక్షులు కొంగర వెంకటనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొమ్ము శంకర్రావు, కందికొండ శ్రీనివాసరావు, బంధం శ్రీనివాసరావు, వత్సవాయి జానకి రాములు, షేక్ నజీర్, బొడ్డుపల్లి కోటేశ్వరరావు, గూగులోతు పంతు, జొన్నలగడ్డ సునీత, ఖానాపురం హవేలీ కార్యదర్శి డి తిరుపతిరావు డిసిసిబి మాజీ డైరెక్టర్ జెట్టి బాలసౌరి, పిల్లలమర్రి వెంకట అప్పారావు, బంధం వెంకటరాజ్యం, బూర్గుల అప్పచారి, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు పిల్లల మరి నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు రావిరాల లక్ష్మణరావు టీఎస్ యుటిఎఫ్ మాజీ జిల్లా కోశాధికారి నెల్లూరి వీరబాబు మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ పలువురు ఉపాధ్యాయులు, వివిధ గ్రామాల నుంచి సిపిఎం శాఖ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.