సిద్దిపేటలో టి ఆర్ ఎస్ నాయకుల అవినీతిపై ఛార్జ్ షీట్ ని విడుదల చేసిన రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్

Published: Monday April 26, 2021
  • ఒక చెరువు అభివృద్ధి పేరుతో ఇంత అవినీతా ?
  • యువతకు ఉపాధి కల్పించే ఒక్క పనైనా చేశారా?
  • అయిదు సంవత్సరాలుగా గగ్గోలు పెట్టినా వేయని రోడ్లు ఎన్నికలొచ్చాయని రాత్రికి రాత్రే వేశారు.
  • అభివృద్ధి పేరు చెప్పి చేసే ప్రతీ పనిలో అవినీతే -- తరుణ్ చుగ్.
సిద్దిపేట (ప్రజాపాలన ప్రతినిధి) : గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు రోడ్లతో ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ రోడ్లు వేయండి మహాప్రభో అని మొత్తుకున్నా లేనిది ఎలెక్షన్ లు వస్తున్నాయనగానే రాత్రికి రాత్రే రోడ్లు వేస్తారు, కనీసం వేసిన రోడ్లయినా నాణ్యతతో ఉన్నాయా అన్నది ప్రజలకు మంత్రి, టిఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి అన్నారు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్.సిద్దిపేట లోని స్థానిక వయోలా గార్డెన్ లో బీజేపీ కార్యకర్తల రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో టి ఆర్ ఎస్ నాయకుల అవినీతిపై ఛార్జ్ షీట్ ను విడుదల చేస్తున్నామన్నారు.టి ఆర్ ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ నాయకులు సిద్దిపేట పేదప్రజలను ఎంత లూటీ చేస్తున్నారో ఈ ఛార్జ్ షీట్ లో సంక్షిప్త పరిచామన్నారు. సిద్దిపేట గల్లీలోని ఏ వ్యక్తిని అడిగినా టిఆర్ఎస్ నాయకుల అవినీతి గురించి చెపుతారన్నారు. సిద్ధిపేటను అభివృద్ధి పరిచామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆ అభివృద్ధి మొత్తం టిఆర్ఎస్ నాయకుల కుటుంబాలలో మాత్రమే కనిపిస్తుందన్నారు. అధికారంలోకి రాకముందు టి ఆర్ ఎస్ నాయకులెలా ఉండేవారో అధికారంలోకి వచ్చాక నేడు వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఒక చెరువు పేరు చెప్పి మీరు ఎంత అవినీతి చేశారో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ చెరువు పేరు మీద ఎంతమంది అభివృద్ధి చెందారో చెప్పాలని ప్రచారంలో మంత్రిని, టిఆర్ఎస్ నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో టి ఆర్ ఎస్ నాయకుల జేబులు నింపుకుంటున్నారే తప్ప ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారో తెలపాలన్నారు. లాభాపేక్షతో చెరువులపై, కట్టడాలపై ఉన్న శ్రద్ధ యువత కడుపు నింపే కార్యక్రమాలెన్ని చేశారో చెప్పాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ పేరు చెప్పి 12 వేల అప్లికేషన్ లలో 2 వేల మందికి కూడా సరిగా ఇవ్వలేదన్నారు, కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీంతో అభివృద్ధి పనులను చేపడుతుంటే ఆ స్కీం ద్వారా లబ్ది పొంది అది రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవాచేశారు. కట్ మనీ ఔర్ ఝట్ మనీ అన్నదే ముఖ్యమంత్రి విధానమని, అబద్దాల ముఖ్యమంత్రి అన్న అవార్డ్ ఏదైనా ఉంటే అది మన తెలంగాణ ముఖ్యమంత్రి కే సి ఆర్ కే దక్కేదన్నారు. ఇది నీతికి అవినీతికి మధ్య పోరాటమని అందుకే వారి అవినీతిపై ఛార్జ్ షీట్ విడుదల చేశామన్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల, కార్యకర్తల విజయం తథ్యమని ఆయన తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో దుబ్బాక ఎం ఎల్ ఏ రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి తోపాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.