ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తా

Published: Monday March 29, 2021
చేవెళ్ల మాజీ ఎం.పి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి 
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చి 28 ( ప్రజాపాలన ) : మూడు నెలల కాల వ్యవధిలో అందరితో కలిసి చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చేవెళ్ల మాజీ ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ కోసం చేవెళ్ల ప్రాంతం అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. అదే లక్ష్యంతో నా పోరాటం కొనసాగిస్తానని ప్రజలకు భరోసా కల్పించారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు, చర్చలు చేసి పార్టీకి ద్రోహం చేసే విశ్వాస ఘాతకున్ని కాలేనని వివరించారు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీని వదిలిన కాబట్టి అన్ని పార్టీల నేతలతో కలిసి మాట్లాడే స్వేచ్చ నాకు ఉన్నదని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత అందరి కంటే ఎక్కువ నష్టపోయింది మా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలేనని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రజల సమస్యల పరిష్కారం దిశగా నా పోరాటం కొనసాగిస్తానని మరోమారు ధీమా వ్యక్తం చేశారు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే నా నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. నా లక్ష్యం ఒక్కటే,  తెలంగాణ అభివృద్ది మా ప్రాంతం అభివృద్ది గురించి ఆలోచనలే ఉంటాయని తెలిపారు. కె.సి.ఆర్. తెలంగాణ ప్రజలను మోసం చేసిండన్నారు. తెలంగాణ సంపదను నిలువునా దోచుకుంటున్నాడని ఆరోపించారు. ప్రజలు కె.సి.ఆర్. కు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కావల్సింది రాజకీయ ఉమ్మడి కార్యచరణ మాత్రమేనని గుర్తు చేశారు. దానికోసం నేను ప్రయత్నం చేస్తాననే విశ్వాసం వ్యక్తం చేశారు. మా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో సాగు నీరు, ఉపాధి, ఉద్యోగం, నిధులు, భూములు, జి.ఓ. 111 ఇట్లా ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా పొరాడుతాననే నమ్మకాన్ని కలిగించారు.