పల్లెలను పచ్చదనంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యం

Published: Saturday July 03, 2021
వికారాబాద్, జూలై 02, ప్రజాపాలన బ్యూరో : హరితహారం, పల్లెప్రగతి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను పచ్చదనంగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పల్లె ప్రగతి, హరితహారం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, ఈ విషయంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ అన్నారు. ఏడో విడత హరితహారం, నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం బంట్వారం మండలం తొర్మామిడి గ్రామంలో పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని ‌పల్లె ప్రకృతి వనంలో కలెక్టర్ మొక్కలు నాటారు. పల్లెలను పచ్చగా ఉంచడమే ధ్యేయంగా మొక్కలు నాటడం జరుగుతుందని వాటిని సంరక్షించి పెంచి పెద్ద చేయాలని కోరారు. గ్రామంలోని ఎస్.సి కాలనీలో పర్యటించి ఇండ్లపై వేలాడే కరెంటు వైర్లను సరిచేయాలని, వంగిన, తుప్పు పట్టిన కరెంట్ స్తంభాలను తొలగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీలను పరిశీలించి మురికి తొలగించాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని రోడ్ల పై చెత్తను వేయరాదని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఇంటింటి నుండి తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున అందించాలని డిపిఓకు సూచించారు. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ, డంపింగ్ యార్డ్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సర్పంచ్ శృతి, ఉపసర్పంచ్ నందు, జడ్పీటీసీ సంతోషా, ఎంపిపి ప్రభాకర్, ఎంపిడిఓ బాలయ్య, మండల స్పెషల్ అధికారి సుజాత, డి ఎల్ పి ఓ అనిత, తహాసీల్దార్ అజీజ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.