హరితహారం లక్ష్యాలను సమన్వయంతో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

Published: Wednesday October 13, 2021
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 11, ప్రజాపాలన : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 2022-23 సంవత్సరానికి గాను జిల్లాలోని 311 గ్రామాల పరిధిలో మొక్కలు నాటేందుకు నిర్ధేశించిన లక్ష్యాలను సాధించే విధంగా కార్యచరణ రూపొందించుకొని ప్రణాళికబద్దంగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్లతో కలిసి వివిధ శాఖల అధికారులతో హరితహారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి 100 శాతం పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని, బ్లాక్ ప్లాంటేషన్, అవని, కమ్యూనిటీ ప్లాంటేషన్తో పాటు హరిత వనాల పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో ఎకరానికి 4 వేల మొక్కలు చొప్పున 24 ఎకరాలలో మొక్కలు పెంచేందుకు ప్రతిపాదించడం జరిగిందని, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో 20 లక్షల మొక్కలు, పురపాలక శాఖ పరిధిలో 6.81 లక్షల మొక్కలు, జిల్లా పరిశ్రమల శాఖకు 1 లక్ష మొక్కలతో పాటు వివిధ శాఖలకు లక్ష్యాలు నిర్దేశించడం జరిగిందని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, చర్చ్ ఆవరణలో మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను పరిరక్షించే విధంగా వాటికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడంతో పాటు జియో టాగింగ్ పూర్తి చేయాలని తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా గ్రామాల పరిధిలో గ్రామ సభలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మొక్కల పెంపకంలో భాగంగా అవసరమైన విత్తనాలు, కవర్లను ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా పరిశ్రమల శాఖ, జిల్లా అటవీ శాఖ, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.