బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశం గడువు పెంపు

Published: Wednesday July 14, 2021
జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్ధన్
మంచిర్యాల బ్యూరో,జూలై 13, ప్రజాపాలన : బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను 3, 5, 8 తరగతులలో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణకు గడువు జూలై 20వ తేదీ వరకు పెంచడం జరిగిందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్ధన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు ఉచితంగా లభిస్తాయని, అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 20వ తేదీ సాయంత్రం 5 గం॥ల లోగా కార్యాలయంలో అందించవలసి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తెలుగు / ఆంగ్ల మాధ్యమము ఎంపిక చేసుకోవచ్చని, 3వ తరగతిలో 22 సీట్లు, 5వ తరగతిలో 11 సీట్లు, 8వ తరగతిలో 11 సీట్లు మొత్తం 44 సీట్లు ఉన్నాయని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1 లక్షా 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల రూపాయలకు మించి ఉండరాదని తెలిపారు. జూలై 29వ తేదీ ఉదయం 11 గం॥లకు కార్యాలయం నందు లాటరీ పద్దతిన విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, బోనఫైడ్, నివాస ధృవీకరణ పత్రములు సంబంధిత తహశిల్దార్చే జారీ చేయబడినవి సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు పని వేళల యందు కార్యాలయంలో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.