ప్రతి సోమవారం "డయల్ ఇన్ గ్రీవెన్స్"

Published: Tuesday August 24, 2021
ప్రతి బుధవారం ధరణి సమస్యలను పరిష్కరిస్తాం
వివిధ సమస్యల పరిష్కారానికి 23 ఫిర్యాదులు
జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్ బ్యూరో 23 ఆగస్ట్ ప్రజాపాలన : ధరణి సమస్యలతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సూచించారు. సోమవారం ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు నిర్వహించిన "డయల్ ఇన్ గ్రీవెన్స్ " కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వివిధ సమస్యలపై (23) ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ధరణి భూ సమస్యలతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కరించుకోవాలని సూచించారు. పంచాయతీ రాజ్, ఉపాధి హామీ, పారిశుద్ధ్యం, మున్సిపల్ సమస్యలు, మిషన్ భగీరథ త్రాగునీటి సమస్యలు, రైతు బంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్,  ఎరువులు, నకిలీ విత్తనాలు, సంక్షేమ శాఖల సమస్యలు, పశు సంవర్ధక తదితర శాఖలకు సంబంధించిన అన్ని సమస్యలపైన కూడా ప్రజలు ఫిర్యాదులు చేసినట్లయితే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ప్రతి బుధవారం కూడా ఉ. 9:30 నుండి 10:30 వరకు "డయల్ ఇన్ గ్రీవెన్స్"  కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం గత వారం నిర్వహించిన గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులపై శాఖల వారీగా తీసుకున్న పరిష్కార చర్యలపై సమీక్షించారు. అన్ని సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కరించి గ్రీవెన్స్ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, డి ఆర్ డి ఓ కృష్ణన్, వికారాబాద్ ఆర్ డి ఓ ఉపేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.