పంచాయతీ కార్మికుల సమస్యలపై సమ్మె నోటీస్

Published: Friday October 08, 2021
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07 (ప్రజాపాలన) : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై నేడు జరిగే టోకెన్ సమ్మెను జయప్రదం చేయాలని గురువారం సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరు లోకేష్ సమ్మె నోటీస్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా అల్లూరి లోకేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 12765 గ్రామ పంచాయతీలలో సుమారు 36 వేల మంది సిబ్బంది పారిశుద్ధ్యం, నర్సరీలు వాటర్ సప్లై, వీధి దీపాల నిర్వహణ, పన్నుల వసూళ్లు, ఆఫీస్ నిర్వహణ, తదితర పనులలో వివిధ కేటగిరీల సిబ్బంది పని చేస్తున్నారని అన్నారు. వీరికి 2019 అక్టోబర్ లో జీవో నెంబర్ 51 విడుదల చేసి రూ 8500 నిర్ణయించి అమలు చేస్తున్నారని, 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక కార్మికుడు చొప్పున ఖరారు చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు 2021లో ఉన్న జనాభాకు సేవలు అందిస్తున్నారని అన్నారు. అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులు గతంలో ప్రభుత్వం నిర్ణయించిన 8500 లు నేటికీ అనేక మందికి అందడం లేదని, మల్టీ పర్పస్ వర్కర్ పేరుతో అనేక పనులు చేయిస్తున్నారన్నారు. ఆదివారం సెలవు ను కూడా లెక్క చేయకుండా పనులు చేయించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా సిఐటియు భావిస్తోందన్నారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత కేటగిరీలను కార్మికులను కొనసాగించాలని, పిఎఫ్, ఈ ఎస్ ఐ, ప్రమాద భీమా సౌకర్యాలు అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన ఎస్క్ డే పేరిట రూ 2 లక్షలు ఇన్సూరెన్స్ అమలు చేయాలని, విధులలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి రూ 10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. తదితర సమస్యల పరిష్కారానికై నేడు జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రాజేందర్, యూనియన్ అధ్యక్షుడు శ్రీకాంత్, రాజు, బాలేష్, శంకర్, శశికళ, కార్మికులు పాల్గొన్నారు.