జర్నలిస్ట్ రఘు అరెస్ట్ అక్రమం, అన్యాయం

Published: Friday June 04, 2021
ఖమ్మం, జూన్ 3, ప్రజా పాలన ప్రతినిధి : జర్నలిస్టుల అరెస్టు అక్రమం, అన్యాయమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల సోమయ్య గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. కోకాపేట కాందిశీకుల భూమి వంటి భూ అక్రమాలపై అనేక కథనాలను వెలుగులోకి తీసుకొచ్చి, తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాన్ని చిత్తశుద్ధిని స్పష్టీకరించి నందుకే తెలంగాణ ప్రభుత్వం రఘును అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేసిందని ఆరోపించారు. మల్కాజిగిరి లోని నివాసం సమీప ప్రాంతంలో ఉదయం 9 గంటలకు నెంబర్ ప్లేట్ లేని జీపులో తలపై ముసుగు వేసి, చేతులు వెనక్కు కట్టేసి, కిడ్నాప్ చేసిన వ్యక్తిని తీసుకుపోయిన రీతిలో అరెస్ట్ చేయడం అక్రమం, అన్యాయం తోపాటు అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. కేవలం కోకాపేట కాందిశీకుల అంశం లోనే కాకుండా 20 వేల కోట్ల ఐడిపిఎల్, 5 వేల కోట్ల ఐకియ భూ కుంభకోణాలను ప్రశ్నించినందుకు జర్నలిస్టు రఘునుఅరెస్టు చేశారని ఆరోపించారు. పైగా, ముసుగు వేసి, చేతులు కట్టి, బలవంతంగా జీవులోఎక్కించుకు పోయే సందర్భంలో  సంబంధిత వ్యక్తులు, ఈ కుంభకోణాలపై వరుస కథనాలను ప్రసారం చేస్తే ఖబడ్దార్ అని... కేకలు వేయడం గమనార్హమైన విషయం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనం అన్నారు. ప్రశ్నిస్తే అసహనం వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికాదని సూచించారు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపే జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం మంచి పద్ధతి కాదన్నారు. మీడియా గొంతునొక్కి, పాలించిన పాలకులు గాని, పార్టీలు గానీ మనుగడ సాగించినట్లు చరిత్ర లేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల విధానాలు వాటి లోపాల గురించి సమీక్షిస్తూ, విమర్శిస్తూ కథనాలు తయారు చేయటం జర్నలిస్టుల బాధ్యతని, వాటిని సరి చేసుకుని ముందుకు పోవటం పాలకుల విధియని ఇదే ప్రజాస్వామ్య లక్షణం మని వివరించారు. అలా కాకుండా రాచరికపు తరహాలో వెళ్తూ హిట్లర్ మాదిరిగా ప్రవర్తిస్తే, ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజాసంఘాలు, పార్టీలు, జర్నలిస్టు సంఘాలతో కలిసి జర్నలిస్టు రఘును భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉపేక్షిస్తే ఇలాంటి అకృత్యాలు మరింత పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టు రఘును బేషరతుగా విడుదల చేయాలని ఆయనపై మోపిన పలు సెక్షన్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు రఘు అరెస్టును ఖండించిన వారిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ కె.వి.కృష్ణారావు, ఎస్సీ ఎస్టీ మానవహక్కుల పరిరక్షణ కమిటీ జిల్లా చైర్మన్ గుంతెటి వీరభద్రం, సంచారజాతుల ఖమ్మం జిల్లా అధ్యక్షులు సోమరాజు, తెలంగాణ ఉద్యమకారులు మా దాసు శ్రీనివాస్, ఎస్.కె.డాన్, వర్క్ వడటియ రాజేష్, తోట వెంకటనారాయణ, వడ్డెబోయిన వెంకటేశ్వర్లు, కంబాల రామారావు, నేలపట్ల వీరబాబు, తావుర్యా నాయక్, బోల్లికొండ పాపారావు, తెలంగాణ శ్రీనివాస్ ఉన్నారు.