ఐటీలో వెస్ట్ హైదరాబాద్ కు దీటుగా ఉప్పల్ అభివృద్ధి

Published: Monday February 14, 2022
ఐటీశాఖ మంత్రివర్యులు కేటీఆర్
మేడిపల్లి, ఫిబ్రవరి13 (ప్రజాపాలన ప్రతినిధి) : ఐటీ రంగంలో వెస్ట్ హైదరాబాద్ కు దీటుగా లుక్ ఈస్ట్ హైదరాబాద్ ఉప్పల్ పరిసర ప్రాంతాలను ఐటీ రంగంలో అభివృద్ధి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్ జెన్‌పాక్ట్లో “జెన్‌నెక్స్ట్ స్క్వేర్” పేరుతో జెన్‌పాక్ట్ మరియు రామ్‌కీ ఎస్టేట్ ‌ వారు సంయుక్తంగా చేపట్టిన సుమారుగా 2 మిలియన్ (ఇరవై లక్షల చదరపు అడుగుల) విస్తీర్ణం కలిగిన వాణిజ్య కార్యాలయ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు కేటీఆర్, చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి  కేసీఆర్ నాయకత్వంలో ఐటీ కారిడార్లు హైదరాబాద్ లేదా నగరంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు విస్తరించేలా కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీని తీసుకువచ్చాం మరియు దానిని పశ్చిమ హైదరాబాద్లోనే కాకుండా నగరం నలుమూలలకు విస్తరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు.పశ్చిమ హైదరాబాద్లోని సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరహాలో రాచకొండ ప్రాంతంలో  మహేష్ భగవత్ నాయకత్వంలో సెక్యూరిటీ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని సూచించారు. జెన్‌పాక్ట్‌ సంస్థ హైదరాబాద్ నలుదిక్కుల 20 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సంస్థల్ని ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ఉప్పల్ ప్రాంతంలో అభివృద్ధి బాగా జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప్పల్ నుండి నారపల్లి వరకు కొత్త ఎలివేటెడ్ కారిడార్, ఉప్పల్ రింగ్ రోడ్ లో స్కై వాక్ లాంటివన్నీ నిర్మాణం జరిగుతోందన్నారు. మెట్రో కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి ప్రజా రవాణా సులువుగా ఉంటుందన్నారు. ఉప్పల్‌లో శిల్పారామం, క్రికెట్ స్టేడియం ఉందని, కోవిడ్ తర్వాత మళ్ళీ క్రికెట్ ప్రారంభం అవుతుందని, అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున జనంతో కళకళ లాడుతుందన్నారు. సెక్యూరిటీ పరంగా రాచకొండ నిలిచిందని, జెన్‌పాక్ట్‌ కంపెనీ వరంగల్‌లో పెట్టడం కూడా శుభపరిణామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రామ్కీ ఎన్విరో మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఈ 7 సంవత్సరాలలో మంత్రివర్యులు కేటీఆర్ దార్శనీకత మరియు డైనమిక్ నాయకత్వం కనుక లేకపోతే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఐటి అభివృద్ధి, మున్సిపల్ అభివృద్ధి మరియు ఇతర పురోగతి ఎంతమాత్రం సాధ్యమయ్యేది కాదు అన్నారు. ఈ కార్యక్రమంలో జెన్పాక్ట్ సంస్థ అధినేతలు విద్యా, సతీష్ ,సీఈఓ గౌతమ్ రెడ్డి, జై జయేష్ రంజన్, రాచకొండ కమిషనరేట్ కమిషనర్ మహేష్ భగవత్, అమర్నాథ్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, జేరిపోతుల ప్రభుదాస్, శాంతి సాయి జైన్ శేఖర్, బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, టీం బిఎస్సార్ వ్యవస్థాపక అధ్యక్షులు బేతి సుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.