ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి

Published: Thursday February 03, 2022
గీత పని వారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దూసరి శ్రీరాములు గౌడ్
బోనకల్, ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి : ఈనెల 6 తేదీ న బోనకల్ మండలం, ముష్టికుంట్ల గ్రామంలో జరిగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, పార్లమెంట్, శాసనసభ మాజీ సభ్యులు, సిపిఐ సీనియర్ నాయకులు ప్రజల మనిషి బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని తెలంగాణ గీత పనివాళ్ళ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దూసారి శ్రీరాములు గౌడ్ పిలుపునిచ్చారు. బోనకల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన అనంతరం బోనకల్ మండల కేంద్రంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొమ్మగాని ధర్మభిక్షం తన జీవితాంతం పేద ప్రజల కోసం పనిచేశారని నాలుగుసార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా గెలుపొందారని గుర్తుచేశారు. గౌడ వృత్తిదారుల కోసం గీత పనివారుల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంతో కోట్లాడి ఎన్నో చట్టాలను ఆయన తీసుకువచ్చారని కొనియాడారు. గీత పని వాళ్లకోసం ఆప్కారి వేలంపాట రద్దుచేసి సొసైటీల ఏర్పాటుకోసం అసెంబ్లీలో పోరాడి కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలను సాధించారని కొనియాడారు. ఈనెల ఆరో తారీఖు నాడు ముష్టికుంట్ల లో జరిగే బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి ఉత్సవాలకు కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగమతి హేమంతరావు, బొమ్మగాని ప్రభాకర్, రాష్ట్ర నాయకులు బొమ్మగాని నాగభూషణం, రాష్ట్ర జిల్లా తదితరులు హాజరుకానున్నారని గౌడ సంఘ నాయకులు పాల్గొలని తెలియజేశారు .కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలకు 5 లక్షల రూపాయలు కేటాయించాలని ప్రతి సహకార సంఘానికి తాటి ఈత ఖర్జూర వలన పంపకాల కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు విడుదల చేసిన 565 జీవో ప్రకారం ప్రతి మండల కేంద్రాల్లో రెండు లేదా మూడు నీరా కేంద్రాలు ఏర్పాటు చేసి గౌడ వృత్తిదారులకు ఆదుకోవాలని ఆయన కోరారు. ధర్మభిక్షం జయంతి సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు తోడేటి కొమురయ్య, వంగాల వెంకటేశ్వర్లు తోపాటు ప్రముఖ వైద్యులు బొల్లికొండ శ్రీనివాసరావు, కేశవగాని రాజశేఖర్ గౌడ్, సిహెచ్ రవి కుమార్ గౌడ్, కే మారుతి బాబు గౌడ్, శ్రీధర్ గౌడ్ ఆర్ రవి ప్రకాష్ గౌడ్ లను, ప్రముఖ వ్యాపారవేత్త వత్సవాయి రవి, మాజీ తాసిల్దార్ బోల్లి కొండ దుర్గయ్య, మండలంలో ఉన్న 11 మంది కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షులను సన్మానించనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ధర్మభిక్షం అభిమానులు కమ్యూనిస్టు పార్టీ అభిమానులు గౌడ గుర్తి సోదరులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, తెలంగాణ గీత పనివాళ్ళ సంఘం సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం, జిల్లా నాయకులు ధారగాని నాగేశ్వరరావు, బంధం నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.