ఈజీఎస్ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేయాలి

Published: Friday April 14, 2023
* జిల్లా జేఏసీ చైర్మన్ నవీన్ కుమార్ 
వికారాబాద్ బ్యూరో 13 ఏప్రిల్ ప్రజా పాలన : ఈజీఎస్ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు జిల్లా జేఏసీ చైర్మన్ నవీన్ కుమార్ గురువారం వినతి పత్రం అందజేశారు.  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 2022 మార్చి 9న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని  ప్రకటించారన్నారు. 2023 ఫిబ్రవరి 6న  జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సెర్ప్ ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరణ చేసి పే స్కేల్ ప్రకటించడం జరిగింది. అదే మాతృ సంస్థ అయిన ఈజిఎస్ ని విస్మరించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఈజీఎస్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరిస్తూ పే స్కేల్ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేయుచున్న 3874 మంది ఈజిఎస్ ఉద్యోగుల జీవితాల్లో ఆనందం నింపాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును జిల్లా జేఏసీ చైర్మన్ నవీన్ కుమార్ కోరడం జరిగిందన్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.