ఆదివాసీలకు అండగా పోలీసులు

Published: Tuesday November 16, 2021
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : జిల్లాలోని తిర్యాని మండలం "మంగి గ్రామంలో పోలీసులు మీకోసం, కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ అడ్మిన్ వై.వి.యస్ సుదీంద్ర పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పి అడ్మిన్ సుదీంద్ర మాట్లాడుతూ మంగి గ్రామానికి వారం రోజులలో బస్సు సౌకర్యం కల్పిస్తామని, గతంలో వైద్య శిబిరం నిర్వహించడం ద్వారా 30 మందికి కంటి సంబంధిత సర్జరీలు, 40 మందికి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. నాటువైద్యానికి కాకుండా అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాన్ని పొందాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారు కార్పోరేట్ ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా పొందే అవకాశం ఉందని దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ, నిరుద్యోగ యువతకు పోటీపరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్, గుండాల, దంతన్ పల్లి, గ్రామాల లో మహిళా సాధికారత పెంపొందించేందుకు ఏర్పాటుచేసిన ఇస్తారాకుల తయారీ కేంద్రం సత్ఫలితాలు వస్తున్నాయని, మరో కేంద్రాన్ని మంగీ గ్రామంలో ఏర్పాటు చేస్తామన్నారు. మంగి గ్రామానికి ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేసినందుకుగాను ఎస్సై రామారావు ను అభినందించారు. శ్రీ మిత్ర హాస్పిటల్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డాక్టర్లు సౌమ్య ప్రియాంక, కీర్తి, వర్ధన్, శ్రీహరి లు పాల్గొని ప్రజలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. యువతకు వాలీబాల్ ఇట్లు, ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డిఎస్పి శ్రీనివాస్, రెబ్బెన సీఐ సతీష్ కుమార్, మంగి ఉపసర్పంచ్ బుజ్జి రావు, భగవంత్ రావు, గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.