అభివృద్ధి పనుల లక్ష్యాలను అన్ని శాఖల సమన్వయంతో పూర్తి చేయాలి.

Published: Thursday June 17, 2021

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 16, ప్రజాపాలన : రాష్ట్రంలో ఆయా జిల్లాల వారిగా కేటాయించిన అభివృద్ధి పనుల లక్ష్యాలను సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి, పట్టణాలను ఆధునీకరించడం కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాల పెండింగ్ పనులను వేగవంతం చేయాలని కోరారు, లే-అవుట్ భూములను క్రమబద్దీకరించా లని, డంపింగ్ యార్డులు, వైకుంఠధామం (స్మశానవాటిక) పనులతో పాటు పారిశుద్ధ్యం పనులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. అంతర్గత మార్కెట్, పశు సంవర్ధకశాఖ పనులు ప్రణాళికబద్ధంగా చేయాలని పేర్కొన్న ఆయన వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలకుండా త్రాగునీటి విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పనులపై పర్యవేక్షిస్తూ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖలకు నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసి పరిరక్షించాలని తెలిపారు. హరితహారం కార్యక్రమం కోసం నర్సరీలలో మొక్కల పెంపకంతో పాటు బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు కూరగాయలు, మాంసం విక్రయ మార్కెట్లను పర్యవేక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం హరితహారం లక్ష్యాలను పూర్తి చేయడం జరిగిందని, 2021-22 సంవత్సరానికి గాను ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో దాదాపు డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో క్లోరినేషన్ తో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా అటవీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుబ్బారాయుడు, పంచాయతీరాజ్ ఈ.ఈ.ప్రకాష్, రోడ్లు, భవనాల శాఖ ఈ.ఈ.రాము, మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.