విద్య యొక్క విలువ, ఆవశ్యకత తెలుసుకొని చదువుకోవాలి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

Published: Thursday February 16, 2023
మంచిర్యాల బ్యూరో,  ఫిబ్రవరి 15, ప్రజాపాలన :
 
విద్య యొక్క విలువ, ఆవశ్యకత తెలుసుకొని ప్రతి ఒక్కరు చదువుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లా వయోజన విద్యాశాఖ, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, సఖి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అండాళమ్మకాలనీ, రంగపేటలలో ఏర్పాటు చేసిన అక్షర కేంద్రాలతో పాటు ఆండాళమ్మకాలనీలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విద్య యొక్క విలువ, ఆవశ్యకత తెలుసుకొని చదువుకోవాలని, అక్షరాస్యతతో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. మహిళా విద్య ద్వారా కుటుంబం, ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం ఎంతో అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన అక్షర కేంద్రాల ద్వారా ఆండాళమ్మకాలనీ, రంగపేట ప్రాంతాలలోని 655 మంది నిరక్షరాస్యులైన వయోజనులకు చదువుకునే అవకాశం కల్పించడం జరిగిందని, వయోజన విద్యా కేంద్రాలలో నిరక్షరాస్యులైన వయోజన మహళలతో అక్షరాలను దిద్దించి, అక్షరాస్యులుగా తీర్చి దిద్దేందుకు పలకలను, వీచీకాలను అందించడం జరిగిందని తెలిపారు. 100 రోజులలో 100 శాతం అక్షరాస్యత సాధించాలని తెలిపారు. మహిళలకు స్వయం ఉపాధి పొందుటకు లయన్స్ క్లబ్-మంచిర్యాల, సఖి ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, అక్షరాస్యతతో పాటు కుట్టు శిక్షణ, అల్లికల ద్వారా స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల జిల్లా అక్షరాస్యతలో ముందుందని, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచే విధంగా వయోజన విద్యా కేంద్రాల ద్వారా ప్రయత్నించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి ఎ. పురుషోత్తం, లయన్స్ క్లబ్-మంచిర్యాల సఖి అధ్యక్షులు కొయడ పద్మ, క్లబ్ సభ్యులు రిక్కల నారాయణరెడ్డి, ఎన్. వెంకటేశ్వర్రావు, చంద్రమోహన్, డి.ఆర్.పి.లు, అంగన్వాడీ టీచర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.