ప్రజల భద్రతపై నిరంతర గస్తీ

Published: Friday February 11, 2022
మేడిపల్లి సిఐ గోవర్ధనగిరి 
మేడిపల్లి, ఫిబ్రవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి) : మేడిపల్లి పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరంతరం గస్తీ కాస్తూ, నేరాలను అడ్డుకట్ట వేస్తూ, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని సిఐ గోవర్ధనగిరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐ గోవర్ధనగిరి మాట్లాడుతూ మేడిపల్లి మండల ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, నేరాలను, నేరగాళ్లను నియంత్రించడంలో ప్రజల సహకారం ఎంతైనా అవసరం ఉందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, ఇంటి ఆవరణ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను కోరారు. పెట్రోలింగ్ వాహనాలు అన్ని కాలనీలలో రాత్రింబవళ్ళు గస్తీ కాస్తున్నాయని తెలిపారు. నిర్మానుష్య ప్రదేశాల్లో మహిళలు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చుట్టు పరిసర ప్రాంతాలను గమనిస్తూ ప్రయాణం కొనసాగిస్తే నేరగాళ్లకు అవకాశం లభించదని సూచించారు. బయటి ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఇంటికి తాళం వేసే సందర్భంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పోలీసులకు సమాచారం ఇవ్వడం వలన తాళం వేసిన ఇంటికి నిఘా పెంచే అవకాశం ఉంటుందని, దొంగతనాలు జరిగే అవకాశం ఉండదని తెలిపారు. ప్రజలకు పోలీసుల నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు, 100 నెంబర్ సంప్రదించి సమాచారం ఇవ్వగలరని కోరారు.