మానవత్వం చాటుకున్న ఖమ్మం ట్రాఫిక్ ఎస్ఐ

Published: Monday October 17, 2022
బోనకల్, అక్టోబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి: గ్రూప్ 1 పరీక్ష రాయడానికి వెళ్లిన ఓ విద్యార్థికి పరీక్షా కేంద్రం తెలియక పోవటంతో ఖమ్మం టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ మదార్ తన ద్విచక్ర వాహనం పై పరీక్షా కేంద్రం వద్ద దింపి తన మానవత్వాన్ని చాటుకున్న సంఘటన ఆదివారం ఖమ్మం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన బండి విజయ్ ఆదివారం ఖమ్మంలోనే ఉమెన్స్ కాలేజీ వద్ద కు వెళ్లాడు. అక్కడ ఆ విద్యార్థి పరీక్షా కేంద్రం తెలియక ఆందోళన చెందుతున్నాడు. అదే సమయంలో ఉమెన్స్ కాలేజ్ దగ్గర విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ మదార్ పరీక్షా ప్యాడు తో ఆందోళన చెందుతున్న విజయ్ ను గమనించాడు. ఎస్సై విద్యార్థి వద్దకు వెళ్లి ఆరా తీశాడు. దీంతో విద్యార్థి తాను గ్రూపు 1 పరీక్ష రాయటానికి వచ్చానని, పరీక్షా కేంద్రం తెలియటం లేదని హాల్ టికెట్ ను ఎస్ఐకి చూపించాడు. హాల్ టికెట్ లో ఉన్న అడ్రస్ ఆధారంగా ఎస్సై ఆ విద్యార్థిని విధి నిర్వహణలో ఉన్న మోటార్ సైకిల్ మీదనే గాంధీనగర్ స్కూల్ పరీక్షా కేంద్రం వద్ద దింపాడు. దీంతో ఆ విద్యార్థి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి వచ్చాడు. ఎస్సై తన మానవత్వాన్ని చాటుకోవటంతో పలువురు ఆయనను అభినందించారు.