సత్తాచాటిన సంధ్యారాణి..* *కఠోర శ్రమతో అత్యుత్తమ ప్రతిభ..* *అభినందించిన గ్రామ సర్పంచ్ మారెళ్ళ

Published: Thursday June 30, 2022
తల్లాడ, జూన్ 28 (ప్రజాపాలన న్యూస్):
 *ఆ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలే.. అయినా కూడా ఆ తల్లిదండ్రులు ఏనాడు కలత చెందలేదు. తండ్రి హమాలీ వర్కర్, తల్లి వ్యవసాయ కూలి పనులు చేస్తూ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. తమ ముగ్గురు పిల్లలను చదివించాలనే పట్టుదలతో గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు. వారిలో పెద్ద కుమార్తె సంధ్యారాణి చదువులో అగ్ర భాగాన నిలిచి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించింది.  సాధించాలనే పట్టుదల.. కఠోర శ్రమతో ఆ విద్యార్థిని విజయతీరాలకు చేర్చాయి. ఇంట్లో  పేదరికం చదువుకు అడ్డురాలేదు. కృషి, పట్టుదల, శ్రమ ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించింది. వివరాలు ప్రకారం.. తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన గొడ్ల బాబు, వసంత దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. తండ్రి హమాలి పనిచేస్తూ కూలీ పనులకు వెళ్తుంటారు. ముగ్గురులో పెద్ద కుమార్తె సంధ్యారాణి ఖమ్మంలోని దానవాయిగూడెం గురుకుల పాఠశాలలో ఇంటర్ (బైపిసి) ప్రథమ సంవత్సరం చదువుతోంది. చదువులో ఎప్పుడు ప్రధమ ర్యాంకులో ఉండేది. ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో సంధ్యారాణి అత్యుత్తమ మార్కులను సాధించింది. మొత్తం 440 మార్కులకు గాను 429 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. హాల్ టికెట్ నెంబర్ 2243106656 ఇంగ్లీష్ లో 90, తెలుగు 99, బొటనీ 60, జువాలజీ 60, ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60  అభేద్యమైన మార్కులతో సత్తాను చాటుకొంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నిలిచి పేదరికం చదువుకు అడ్డుకాదని చాటి చెప్పింది. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సూచనలు, పట్టుదలతో చదివి ఈ విజయం సాధించానని తెలిపారు. ఇంగ్లీషులో మార్కులు 11తక్కువగా రావటంతో ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు వెల్లడించింది. తన విజయానికి కృషిచేసిన ఉపాధ్యాయులకు, సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  మంచి మార్కులతో విజయం సాధించి గ్రామ ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన సంధ్యారాణిని గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత అభినందించారు.*