తెలంగాణలో పండిన పూర్తి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి : తెలంగాణ ప్రజాసంఘాల జె ఏ సి రా

Published: Thursday November 11, 2021
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : కేంద్రం రైతులపై నల్ల చట్టాలను తీసుకు రావడాన్ని తెలంగాణ ప్రజాసంఘాల జె ఏ సి వ్యతిరేకిస్తున్నదని అన్నారు తెలంగాణ ప్రజాసంఘాల జె ఏ సి రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం. సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం హిందు ముసుగు వేసుకుని హిందువులను మోసం చేస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశానికి అన్నం పెట్టే రైతన్న పై ఉక్కుపాదం మోపుతున్నదన్నారు. బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు రాజకీయాల కోసం, ఓట్ల కోసం మాట్లాడుతున్నారని వారికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చెప్పించాలని ఆయన బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. దళితులపై ప్రేముంటే బిజెపి పాలిత రాష్ట్రాలలో దళిత బందును అమలు అయ్యేలా చూడాలన్నారు.ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు మంత్రిత్వశాఖను పెట్టలేదన్నారు.దేశ వ్యాప్తంగా ప్రతీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్రం మాటలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు, బీజేపీ నాయకులు వాటి గురించి కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు.రాష్ట్రాలలో పండించిన ధాన్యాన్ని కేంద్రం, దాని ఆధ్వర్యంలో ని ఎఫ్ సి ఐ కొనాల్సింది పోయి రాష్ట్రాలపై ఆంక్షలు విధించడం సబబు కాదన్నారు. రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు,త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రైతాంగం తో నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయన్నారు. ఈటెల రాజేందర్ గెలిస్తే బీజేపీ గెలిచినట్టు చెప్పుకోవడం విడ్డురంగా ఉందన్నారు. ఈటెల, రఘునందన్ లు వ్యక్తిగత ఇమేజ్ తో గెలిచారన్నారు. షాదనగర్ నియోజకవర్గం లోని కొందుర్గు మండలం రేగడి చిలక మర్రి లో సర్వే నంబర్ 305/3 లోని ఏర్పుల కుంటమ్మకు చెందిన ఐదు ఎకరాల భూమిని కబ్జా చేసిన విఠల్ రెడ్డి పై ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ కేసును నమోదుచేయాలని తెలంగాణ ప్రజాసంఘాల జె ఏ సి రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. విఠల్ రెడ్డి తండ్రి గతంలో విక్రయించిన భూమిని పట్టా చేయిస్తానని పత్రాలు తీసుకొని అతని భార్య పేరుపై రిజిస్టర్ చేయించాడని ఆరోపించారు.