గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం. జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్

Published: Thursday December 22, 2022
మంచిర్యాల బ్యూరో,  డిసెంబర్ 21, ప్రదాపాలన :
 
దేశాభివృద్ధి గ్రామాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుందని, క్షేత్రస్థాయి అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనదని జిల్లా అదనపు కలెక్టర్ బి.రాహుల్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్ నుండి జూమ్ మీటింగ్ ద్వారా వినూత్న రీతిలో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు సాంకేతికంగా ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉన్నప్పుడే గ్రామాలలో మరింత అభివృద్ధి జరుగుతుందని, అంతటి ప్రాముఖ్యత ఉన్న అధికారులు విధి నిర్వహణలో నిబద్ధత, పూర్తి స్థాయి నైపుణ్యత కలిగి ఉండాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో ప్రతి అంశంపై అవగాహ కలిగి ఉండాలని, ఈ క్రమంలోనే వారి నైపుణ్యాలను తెలుసుకునేందుకు ఈ క్విజ్ నిర్వహించడం జరిగిందని, అవసరమైతే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

నిరంతరం వారు నిర్వహించే విధులు సహా పంచాయతీరాజ్ చట్టంపై మొత్తం 25 ప్రజలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని స్వయంగా రూపొందించి 20 నిమిషాల సమయంతో పంచాయతీ కార్యదర్శుల నైపుణ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ క్విజ్ పోటీలు నిర్వహించడం రాష్ట్రంలోనే తొలిసారి. పంచాయతీ కార్యదర్శుల్లో నైపుణ్యాన్ని పెంచే దిశగా వినూత్నంగా ఆలోచించిన అడిషనల్ కలెక్టర్ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.