ప్రమాద స్థలాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయాలి

Published: Wednesday July 27, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 26 జూలై ప్రజా పాలన :  జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అందరు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ, గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయని,  ఏలాంటి ప్రమాదాలు జరగకుండా ఎంపీడీఓ లు గ్రామాలలో దండోరా వేయించి అత్యవసర పనులకు తప్ప, ప్రజలు అనవసరంగా నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా నిరోధించాలని కలెక్టర్ సూచించారు.  ఇరిగేషన్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, వి ఆర్ ఏ లను వెంటనే ప్రమాద స్థలాల వద్ద నియమించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గుర్తించిన 52 ప్రమాద స్థలాలను బ్లాక్ చేయించాలని సూచించారు. డ్యూటీలు కేటాయించిన  పోలీస్, రెవిన్యూ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పోలీస్ సిబ్బంది అందరు అలర్ట్ గా 24 గంటలు పూర్తి శ్రద్ధతో  పని చేసి ప్రమాదాలను అరికట్టాలని అన్నారు.  శితిలావస్థలో ఉన్న పాత గృహలలో నివసించే ప్రజలను వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తెగిపోయిన రోడ్లు, ప్రమాదకరగా ప్రవహిస్తున్న వరద నీటి వద్ద ఎట్టి పరిస్థితిలో వాహనదారులు ప్రజలను అనుమతించ కూడదని,  అత్యవసర పరిస్థితిలో ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలన్నారు.  వికారాబాద్ పట్టణములోని రామయ్యగూడ లోని నివాసాలలో వచ్చిన నీటిని వెంటనే తొలగించాలని, మురికి కాలువలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలన్నారు.   మున్సిపల్ కమీషనర్ కౌన్సిలర్లు విస్తృతంగా వార్డులలో సహాయక చర్యలు చేపట్టాలన్నారు.  మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏలాంటి ప్రమాదాలు జరుగకుండాసురక్షితంగా ఉండాలన్నారు.  ఈ సందర్బంగా కలెక్టర్ అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మండలాల వారిగా పరిస్థితులపై సమీక్షించారు. జిల్లా యస్ పి కోటిరెడ్డి మాట్లాడుతూ, ప్రమాదకరంగా గుర్తించిన 52 స్థలాల వద్ద పోలీస్ సిబ్బందిని నియమించి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.  వికారాబాద్ తాండూర్ ప్రధాన దారిలో భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడం జరిగిందని తెలియజేసారు.  నవాబ్ పేట, మోమిన్ పేట వద్ద కూడా బ్యారీకేడింగ్ చేసి ప్రజలు రాకుండా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, ఆర్ అండ్ బి, ఇ ఇ లు, ఆర్ డి ఓ లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.