బాలికలను చదివిస్తే అదే గొప్ప ఆస్తి

Published: Wednesday January 11, 2023
* 2.5 కోట్ల నిధులతో నిర్మాణం
* మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే కేజీబీవీ లక్ష్యం
* విద్యార్థుల మేధోశక్తిని ప్రేరణ పొందేలా బోధించాలి
* చాంద్రాయన్ పల్లిలో కేజీబీవీ భవనం ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి
వికారాబాద్ బ్యూరో 10 జనవరి ప్రజా పాలన : ప్రతి తల్లిదండ్రి ఆడపిల్లలను బాగా చదివిస్తే అదే వారికి తరగని ఆస్తిగా మారుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆడపిల్లల చదువుకు సిఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని కొనియాడారు. మంగళవారం మోమిన్ పేట మండల పరిధిలోని చాంద్రాయన్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పెద్దోళ్ళ అంజన్న అధ్యక్షతన మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దబ్బని వెంకట్ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అదనపు గదులు ప్రయోగశాలను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి మోమిన్ పెట్ మండల ఎంపీపీ దబ్బని వసంత వెంకట్ హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ 2.5 కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అదనపు గదులు ప్రయోగశాలను ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాలు ఉంటారని సాన బెడితే అణిముత్యాలు బయటికి వస్తాయని అన్నారు. నాడు అమ్మాయిలను  చదివించటం కష్టంగా ఉండేదని గత జ్ఞాపకాలను గుర్తు చేశారు. నేడు విశ్వవిద్యాలయాలు అమ్మాయిలతో నిండి కుండలా మారాయన్నారు. ఓయూలో 70 శాతం, కాకతీయ యూనివర్సిటీలో 80 శాతం విద్యార్థినీలతో నిండిపోయాయని అన్నారు. పిల్లల ఆసక్తికి అనుగుణంగా చదివించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వారికి ఆసక్తి గోలిపేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని మంత్రి హితవు పలికారు. చదువును మించిన ఆస్తి ఏమి ఉండదని బాగా చదివితే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున గురుకులాలు, కెజిబివి పాఠశాలలు నెలకొల్పి చాలా వరకు ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేసి నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తున్నారని వెల్లడించారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కెజిబివి విద్యార్థులు చదువులో బాగా రాణిస్తున్నారని ప్రశంసించారు.
ప్రైవేటు పాఠశాలలో క్వాలిఫికేషన్ టీచర్లు ఉంటారో లేదా తెలియదు కానీ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం క్వాలిఫికేషన్ టీచర్లతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వివరించారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కేజీబీవీ విద్యాలయాల్లో ప్రాథమిక విద్యతో పాటు ఇంటర్ విద్యను కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు. పేద మధ్యతరగతి ఆడపిల్లల చదువుకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. ఆడపిల్లల చదివితే మీ భవిష్య జీవితానికి బంగారు బాట వేసుకోవచ్చని ఆకాంక్షించారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ కేజీబీవీలో మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్య లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నూటికి 95 శాతంతో మంచి విద్య అందడంతో పాటు మంచి ఫలితాలు కూడా వస్తుండడం విశేషమని కొనియాడారు.
జడ్పి చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బాలికల విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పం అని అన్నారు. వికారాబాద్ అభివృద్ధిలో వెనుకబడిన విద్యారంగంలో మాత్రం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా రాణిస్తున్నవని స్పష్టం చేశారు. చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కెజిబివిలో చదువుతో పాటు నాణ్యమైన ఆహారం లభిస్తుందా అని ప్రశ్నించారు. విద్యార్థిని లక్ష్మి మాట్లాడుతూ పదవ తరగతి లోపు విద్యార్థులకు ఏమైన అనుమానాలు ఉంటే ఇంటర్ విద్యార్థులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా కట్టుకున్న ఇండ్ల లబ్ధిదారులకు సర్టిఫికెట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి చీమల్ దరి గ్రామ సర్పంచ్ నాసన్ పల్లి నరసింహారెడ్డి ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.