గోధంగూడను పారిశుద్ధ్య రహితంగా తీర్చి దిద్దడమే లక్ష్యం

Published: Wednesday June 23, 2021
గోధంగూడ సర్పంచ్ అనిత సత్తయ్యగౌడ్
వికారాబాద్, జూన్ 22, ప్రజాపాలన బ్యూరో : గోధంగూడ గ్రామాన్ని పారిశుద్ధ్య రహితంగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అనిత సత్తయ్యగౌడ్ అన్నారు. మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాభివృద్ధి పనులు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. వైకుంఠధామం, నర్సరీ, కంపోస్ట్ షెడ్ వంద శాతం పూర్తి చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కంపోస్ట్ షెడ్ లో కంపోస్ట్ ఎరువును కూడా తయారు చేస్తున్నామని వివరించారు. ఇతర గ్రామాల నుండి 50 కిలోల కంపోస్ట్ ఎరువు బ్యాగును 550 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్పారన్నారు. గ్రామంలో తయారైన కంపోస్ట్ ఎరువును విక్రయించేందుకు గ్రామ సభ తీర్మాణం చేశామని గుర్తు చేశారు. ఒక కిలో కంపోస్ట్ ఎరువును 15 రూపాయల చొప్పున విక్రయించేందుకు నిర్ణయించామని తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నామని అన్నారు. కంపోస్ట్ ఎరువును రైతులకు విక్రయించే ముందు ప్రకృతి వనానికి ఉపయోగించడం వలన మొక్కలన్నీ ఏపుగా పెరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. కంటికి కనబడని శత్రువును ఓడించడానికి ప్రతి వార్డులో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించామని పేర్కొన్నారు. ఎస్సీ కాలనీలోని మురికి కాలువలను శుభ్రం చేయించి, చెత్తనంతా డంపంగ్ యార్డుకు తరలించడం జరిగిందన్నారు. మిషన్ భగీథ ట్యాంకులను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేస్తున్నామని వివరించారు. నేను పదవిలో ఉన్నంత వరకు ప్రజలకు ఏ కష్టం రానివ్వకుండా చూడాలన్నదే లక్ష్యంగా కృషి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలే నా సమస్యలుగా పరిష్కరిస్తానని భరోసా కల్పిస్తున్నారు.