రైతులను విస్మరిస్తే సహించంఅఖిలపక్ష పార్టీల హెచ్చరిక

Published: Tuesday September 28, 2021
 బోనకల్, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్రంప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, అహర్నిశలు కష్టించి పని చేసి దేశానికి అన్నం పెట్టే రైతన్నను విస్మరిస్తే సహించబోమని అఖిలపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యవసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని బీజేపీ ఏతర పార్టీల ఆధ్వర్యంలో జరిగిన భారత్ బంద్ బోనకల్ మండలంలో విజయవంతమైంది. మండల కేంద్రంలోని చిరు వ్యాపారస్తులు రైతులకు అండగా బంద్ కు మద్దతుగా నిలిచి తమ వ్యాపారాలను, షాపులను మూసివేశారు. జోరు వర్షంలో కూడా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీల కార్యకర్తలు మండల కేంద్రానికి చేరుకుని ర్యాలీగా మండల కేంద్రంలో తిరిగారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ రైతులను విస్మరిస్తే సహించేది లేదని మోడీ పతనం ఈ భారత్ బంద్ నుండే ప్రారంభమైందని అన్నారు. గతంలో పెట్రోల్ రేట్లు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు గగ్గోలు పెట్టినా బిజెపి నాయకులు ఇప్పుడు మాత్రం అబద్ధాల ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. భారత్ బంద్ కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఎన్నడూ లేని విధంగా వ్యతిరేక ప్రచారాలు చేస్తూ అబాసుపాలు అయ్యారని వారు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ చట్టాలు అమలు అయితే దేశంలో రైతు అనేవాడు ఉండడని, కేవలం కార్పొరేట్ బానిసలుగా ఈ దేశం మారిపోయే ప్రమాదం ఉందన్నారు. మన పొలాన్ని మన ప్రమేయం లేకుండానే, మనకి తెలియకుండానే లీజుకు ఇచ్చే పరిస్థితి నెలకొంటుందని కనుక రైతులందరూ కలిసి ముక్తకంఠంతో ఈ చట్టాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, డీసీసీ జిల్లా కార్యదర్శి బంధం నాగేశ్వరరావు, జడ్పిటిసి మోదు సుధీర్ బాబు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు, టిడిపి అధ్యక్షులు రావుట్ల సత్యనారాయణ, యూటిఎఫ్ నాయకులు పిల్లలమర్రి  వెంకటేశ్వర్లు,  సిఐటియు నాయకులు బోయినపల్లి వీరబాబు, బోనకల్ గ్రామ సిపిఎం నాయకులు తెల్లాకుల శ్రీనివాసరావు, పిల్లలమర్రి నాగేశ్వరరావు భద్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు.