ఎల్లవేళలా అందుబాటులో అధికారులు ఉంటూ, ప్రజలకు మనోధైర్యం కల్పించాలి

Published: Thursday May 13, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన : కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రజలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లాలో కరోనా భాదితులకు అండగా ఉండాలని, సకాలంలో చికిత్స అందలేదని ఫిర్యాదులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కరోనా నియంత్రణకు రంగారెడ్డి జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై బుధవారం నాడు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...... రంగారెడ్డి జిల్లాలోని 3, 41 ,931 మంది  కుటుంబాల్లో ఫీవర్ సర్వే నిర్వహిస్తే 5,104 మందికి జ్వరం ఉందని తెలిసిన వెంటనే అవసరమైన మందులను, కరోనా కిట్లను అందజేశామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 130 ప్రైవేట్ హాస్పిటల్స్, 3 ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా బాధితులకు చికిత్స లభిస్తున్నదని మంత్రి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 6,91,468 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం 6,316 ఆక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలో అవసరమైన మేరకు రేమిడిస్వీర్ ఇంజక్షన్లతో పాటు అవసరమైన మందులను సిద్ధంగా అందుబాటులో ఉంచామని, మందులను కావాల్సినంత సరఫరా చేస్తున్నామని మంత్రి అన్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే  ప్రతి ఒక్కరూ పరీక్ష చేసుకోవాలని, పాజిటివ్ అని తేలితే వెంటనే మందులను స్వీకరించాలని చెప్పారు. కరోనా వచ్చిన వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రోగులకు మనో ధైర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పని చేస్తూ ఈ కష్ట కాలాన్ని అధిగమించాలని అధికారులను కోరారు. జిల్లా స్థాయిలో వేసిన కమిటీలు తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ప్రజల క్షేమం కొరకే తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడం జరిగిందని, ఇంకా ఈ లాక్ డౌన్ లో ఏమి చేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందో చూసి అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. పరీక్షలు చేసుకుని ఇంట్లో ఉండేవాళ్ళు చాలా మంది పేదవాళ్ళు కావున ఎక్కువ ఐ సోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎక్కడి రోగులకు అక్కడే పూర్తి స్థాయి వైద్యం, చికిత్స అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. లాక్ డౌన్ సమయంలో వ్యవసాయానికి మినహాయింపు ఇచ్చినందున రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అధికారులను కోరారు. సీఎం కేసిఆర్ గారు పెద్ద మనసుతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఈ ప్రక్రియకు ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని ఆమె అన్నారు. పటిష్టంగా ఈ కరొనాను కట్టడి చేసేందుకు సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు.   వెంటిలేటర్లు, ఔషదాలు, ఆక్సిజన్ ఎంత సమకూర్చినప్పటికీ ప్రజా చైతన్యంతోనే కరోనా మహమ్మారిని రూపుమాపగలమని మంత్రి అన్నారు. కోవిద్ ఉదృతమవుతున్న ఈ సమయంలో ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని అన్నారు. ప్రతీ ఒక్కరు మాస్క్ పెట్టుకునే విధంగా, భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ దిశలో ప్రజలను చైతన్య వంతులను చేయాలనీ పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి అధికారులందరూ కోవిడ్ కేంద్రాలను సందర్శించి రోగులకు కూడా ధైర్యాన్ని అందించాలని కోరారు. కరోనాకు చికిత్స అందిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమానులతో మీటింగ్ పెట్టీ సమన్వయం సాధిస్తామని మంత్రి తెలిపారు. కరోనా నివారణ పద్ధతులు, వాక్సినేషన్ పై మరింత అవగాహన పెంపొందించాలని కోరారు. లాక్ డౌన్ వల్ల రెండో విడత వాక్సిన్ తీసుకొనే వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రంగారెడ్డిజిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వరాజ్య లక్ష్మి, జిల్లా పరిశ్రమల అధికారి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.