ఒప్పందం ఉంది నిరూపిస్తే రాజీనామా చేస్తారా...!

Published: Tuesday June 14, 2022
కౌన్సిలర్ లంక పుష్పలతా లక్ష్మీకాంత్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో జూన్ 13 ప్రజాపాలన : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని చేపట్టే ముందు ఒప్పంద పత్రం రాసుకున్నామని కౌన్సిలర్ లంక పుష్పలతా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కౌన్సిలర్ లంక పుష్పలతారెడ్డి స్వగృహంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికారాబాద్ మున్సిపల్ కు జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున ఇద్దరం చిగుళ్ళపల్లి మంజుల రమేష్, లంక పుష్పలతా లక్ష్మీకాంత్ రెడ్డిలు గెలిచారని పేర్కొన్నారు. చైర్ పర్సన్ పదవిని చేపట్టుటకు అధిష్టానం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తో పాటు కొంత మంది కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకులు తెచ్చామని వివరించారు. ఇద్దరు కూడా పార్టీకి అవసరమేనని అధిష్టానం ఆదేశించారని స్పష్టం చేశారు. సామరస్యపూర్వకంగా చైర్ పర్సన్ పదవి సమస్యను పరిష్కరించేందుకు మొదటి రెండున్నర ఏళ్ళు చిగుళ్ళపల్లి మంజుల రమేష్, తరువాత రెండున్నర ఏళ్ళు లంక పుష్పలతా లక్ష్మీకాంత్ రెడ్డి చేపట్టుటకు ఒప్పంద పత్రం రాసుకున్నామని వెల్లడించారు. జూన్ మాసాంతంతో ప్రస్తుత చైర్ పర్సన్ పదవీకాలం పూర్తి కానున్నదని తెలిపారు. ఒప్పంద పత్రం ప్రకారం తర్వాత రెండున్నర ఏళ్లు చైర్ పర్సన్ పదవీ కాలాన్ని పూర్తి చేయుటకు లంక పుష్పలతా లక్ష్మీకాంత్ రెడ్డికి అప్పగించాలని డిమాండ్ చేశారు. 
రాజకీయ విశ్లేషకులు, మేధావుల మాటలు :
ఒప్పంద రాజకీయాలతో వికారాబాద్ పట్టణ అభివృద్ధికి ఆటంకం ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. ప్రస్తుత చైర్ పర్సన్  రాజీనామకు ససేమిరా అనడంతో కుర్చీ కొట్లాట తీవ్రంగా మారింది. పదవి ఆశిస్తున్న వర్గం  సహాయ నిరాకరణ చేస్తాం అనడంతో అభివృద్ధి పనులకు విఘాతం కలగనున్నది. విశ్లేషకులు మేధావులు పార్టీ పెద్దలు  నాలుగు గోడల మధ్య కూర్చుని పరిష్కరించాల్సిన అంశాన్ని బజారుకీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీని అధికార పార్టీలో జరుగుతున్న రచ్చ ఎటువైపు దారితీస్తుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.