ప్రాథమిక స్థాయిలోనే మెరుగైన విద్య అందించాలిజిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య

Published: Saturday October 15, 2022

మధిర అక్టోబర్ 14 (ప్రజా పాలన ప్రతినిధి) ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే మెరుగైన విద్యను అందించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సూసించారు. శుక్రవారం స్థానిక సిపిఎస్ పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు సిఆర్పి ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు విద్యా బోధన చేయాలన్నారు. ఈనెల 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించే ప్రాథమిక పాఠశాలల మానిటరింగ్ ప్లానింగ్ గురించి మండల నోడల్ అధికారి ప్రభుదయాల్ ని అడిగి తెలుసుకున్నారు. మండలంలో 40 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని అన్నింటిని ఈనెల 31 లోపు సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు నోడల్ అధికారి వివరించారు. సందర్శన సమయంలో సీ గ్రేడ్ విద్యార్థులపై, తరగతి బోధనపై ప్రత్యేక దృష్టి సారించాలని, తరగతిగది బోధన ప్రణాళిక ప్రకారం జరగాలని ఆయన సూచించారు. అన్ని పాఠశాలల్లో శనివారం పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహిస్తూ సీ గ్రేడ్ విద్యార్థుల పట్ల తల్లిదండ్రులతో చర్చించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన సూచనలను విధిగా పాటించాలన్నారు. ఈ సమావేశంలో మండల విద్యాధికారి ప్రభాకర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నారాయణ, విజయశ్రీ ఉపాధ్యాయులు బావ్ సింగ్ మరియు సిఆర్పిలు పాల్గొన్నారు.