సిఎం కేసిఆర్ ఇస్తున్న నిధులతో నగరాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

Published: Wednesday July 06, 2022
 కోర్టు మంచినీటి రిజర్వాయర్ సామర్థ్యం పెంచుతూ... 1.95 కోట్ల రూ. తో 9 లక్షల లీ. ట్యాంక్ నిర్మాణం. 
 
* 25 వ డివిజన్ తో పాటు కోర్టు రిజర్వాయర్  పనులకు భూమి పూజ చేసిన మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు.
 
కరీంనగర్ జూలై 5 ప్రజా పాలన ప్రతినిధి :
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా... నీతి వంతమైన పాలన అందిస్తూ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నామని బీసీ సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా మంగళవారం రోజు మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 25వ డివిజన్ కిసాన్ నగర్ లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్, స్థానిక కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్ తో కలిసి 28 లక్షల సీఎం అస్యూరెన్స్ నిధులతో సిసి రోడ్ డ్రైనేజీ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం 58వ డివిజన్ పరిధిలోని కోర్టు రిజర్వాయర్ లో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చర్ల స్వరూపరాణి హరిశంకర్, కమిషనర్ సేవా ఇస్లావత్, స్థానిక కార్పొరేటర్ రాపర్తి విజయ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఏఈ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు. నగర పాలక సంస్థకు  చెందిన 37 లక్షల నిధులతో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి... జవాబు దారితనంగా ఉండి పని చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. నగర వాసులకు సుందరమైన... ఆరోగ్యవంతమైన నగరాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్లు డ్రైనేజీల నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు చేపట్టి నగరం పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధి కోసం గత 50 సంవత్సరాల నుండి రాని నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. భారీగా వస్తున్న నిధులతో నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని అన్నారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని ఏ కార్పొరేషన్ లో లేనివిధంగా నగరపాలక సంస్థ ద్వారా ప్రతిరోజు నీటిని సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. అంతే కాకుండా 24 గంటలు నిరిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. 24 గంటల నీటి సరఫరా లో భాగంగా ఇప్పటికే నగరంలో మూడు రిజర్వాయర్లను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి పనులను వేగవంతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే పైలెట్ ప్రాజెక్టును రాయల్ రన్ చేసి నగర ప్రజలకు 24 గంటల నీటి సరఫరాను విజయవంతం చేస్తామన్నారు. నగరంలో పెరుగుతున్న జనాభా... నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోర్టు రిజర్వాయర్ లో ఇప్పటికే 10 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్నప్పటికీ అదనంగా మరో తొమ్మిది లక్షల లీటర్ల సామర్ధ్యాన్ని పెంచుతూ కోటి 95 లక్షలతో నూతన ట్యాంక్ నిర్మాణాన్ని త్వరలోనే నిర్మాణం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నగరవాసులకు త్రాగునీటి సరఫరా లో ఎక్కడా ఇబ్బందులు ఎత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేలా కోర్టు రిజర్వాయర్లు కార్యాలయ నిర్మాణానికి కూడా భూమి పూజ చేశామని తెలిపారు. ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నీతివంతమైన పాలన అందిస్తూ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే ముందుకు సాగుతున్నామని తెలిపారు. భావి తరానికి గొప్ప నగరాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పోరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.