ఓటర్ జాబితాలో 100% వెరిఫికేషన్ పూర్తి చేయాలి

Published: Saturday January 21, 2023
 రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
వికారాబాద్ బ్యూరో 20 జనవరి ప్రజా పాలన : జిల్లాలో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితాలో ఉన్న పి.ఎస్.ఈ ఎంట్రీలు వంద శాతం ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. 
శుక్రవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో  జాతీయ ఓటర్ దినోత్సవం, పి.ఎస్.ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ, ఓటర్ ఐ.డి. తో ఆధార్ అనుసంధానం ప్రక్రియ పై వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.
ఈ సందర్బంగా ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, జనవరి 25 న జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని,  ప్రతి జిల్లాలో ఎన్నికల కమిషన్ ద్వారా జారీ చేసిన సాంగ్ ను మైక్ ల ద్వారా వినిపించిన అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించాలని, 80 సంవత్సారాలు వయస్సు పైబడిన ఓటర్ లను, నూతన ఓటర్ లను  సన్మానించుకోవాలని కలెక్టర్ లకు ఆయన సూచించారు.  ఎన్నికల కమిషన్ అందించే ఓటరు పాటను స్థానిక కేబుల్ చానెళ్లలో, సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని సూచించారు. ఈ సంవత్సరం ఓటరు దినోత్సవం యొక్క థీమ్ *నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్* దీని ప్రకారం ప్రతి ఒక్కరు ఎన్నికల సమయంలో ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీ లో సైతం ఓటరు దినోత్సవం వేడుకలను నిర్వహించి ప్రతిజ్ఞ చేయించాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో  ఆధార్ లింకేజ్ అనుసంధానం ప్రశంసనీయంగా ఉన్నదని, అర్బన్ ప్రాంతంలో ప్రణాళిక రూపొందించుకొని ఆధార్ లింకేజ్ ఎక్కువగా చేయాలనీ అధికారులను ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 వేల పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 12 లక్షల పి.ఎస్.ఈ ఎంట్రీలను బూత్ స్థాయి అధికారులు వంద శాతం రాబోయే 15 రోజుల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని, దానికి అవసరమైన చర్యలు తీసుకుంటూ, విజయవంతం అయ్యే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. రెండు చోట్ల ఓటరు నమోదు ఉన్న 12 లక్షల కేసుల్లో దాదాపు 80 శాతం మేర ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే సమయంలో సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఫీల్డ్ వెరిఫికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో నూతనంగా ఓటరు నమోదు చేసిన అభ్యర్థులకు ఓటరు కార్డులు పోస్టల్ శాఖ ద్వారా ఓటర్లకు చేరే విధంగా జిల్లా స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ, జిల్లాలో 68 శాతం ఆధార్ లింకేజ్ పూర్తి అయిందని, రానున్న రోజుల్లో బి.ఎల్.ఓ.ల వారీగా రూట్ మ్యాప్ తయారు చేసి మానిటర్ చేసి పురోగతి సాధించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని పట్టణాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి పురోగతి సాధిస్తామని తెలిపారు.

ఈ వీడియో సమావేశంలో  జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవిన్యూ అధికారి అశోక్ కుమార్, ఎలక్షన్ డి.టీ. రవీందర్ దత్తు తదితరులు పాల్గొన్నారు.