ఐసోలేషన్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేయండి: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Thursday April 29, 2021

బెల్లంపల్లి, మార్చి 28, ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ లోని ఐసోలేషన్  కేంద్రంలో  కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సంబంధిత వెంటిలేటర్లను, ఆక్సిజన్ సిలిండర్లను, అత్యవసరమైన మందులను అన్ని పరికరాలను సమకూర్చాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు. బుధవారం నాడు బెల్లంపల్లి ఏరియా సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక  డాక్టర్ అనిల్ తో ఏరియా హాస్పిటల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండవ విడత కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా ఐసోలేషన్ కేంద్రంలో బెడ్లను వెంటిలేటర్లను అత్యవసరమైన మందులను కొనుగోలు చేసి ఉంచాలని సంబంధిత ప్రత్యేక వైద్య నిపుణులను అందుబాటులో ఉంచాలని సూచించారు, ఐసొలేషన్ లో ఉన్న ప్రతి కరోనా పేషెంట్ కు వైద్యులు మరియు సిబ్బంది తగిన జాగ్రత్తలు చెపుతూ వారిలో మనోధైర్యం నింపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గ ప్రజలు ఎవరు అనవసరంగా బయటకు రావద్దని అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావలసి వస్తే మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ స్వీయనియంత్రణలో ఉంటూ తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ శానిటైజేషన్ చేసుకోవాలని, ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారు మే 1వ తేదీ నుండి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తనను నేరుగా కలసి గాని చరవాణి ద్వారా గాని తెలియజేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లో సింగరేణి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి, డాక్టర్ అనిల్, మరియు ఆసుపత్రి సూపరింటెన్డెంట్ తదితరులు పాల్గొన్నారు.