ఈ నెల 6 నుండి 12వ తేదీ వరకు ప్రత్యేక స్వేచ్ఛ కార్యక్రమాలు ..జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Tuesday September 06, 2022
జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుండి 12వ తేదీ వరకు జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలలో ప్రత్యేక స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, జిల్లా అధికారులతో కలిసి స్వచ్ఛ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా రోజు వారి కార్యక్రమాలు కేటాయించడం జరిగిందని, మొదటి రోజు చెత్త, డిస్పోజల్ వ్యర్థాల తొలగింపు, రెండవ రోజు పాఠశాల భవనం, పరిసరాల శుభ్రత, మూడవ రోజు మూత్రశాలలు, నీటి ట్యాంక్ల పారిశుద్ధ్యంతో పాటు పరిశుభ్రత ఆవశ్యకతపై పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు., నాలుగవ రోజు వంటశాల, భోజనశాల పరిశుభ్రత, ఐదవ రోజు మొక్కలు నాటుట, ఆరవ రోజున పారిశుద్ధ్యంపై సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలల ఆవరణ, వంటశాల, భోజనశాల, తరగతి గదులు, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రపరుచుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలల్లో అవసరమైన ఫర్నీచర్, సామాగ్రి మరమ్మత్తులు చేయించాలని, పాఠశాలల భవనాలు శుభ్రపర్చాలని, ఆవరణలోని పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించి నాటిన మొక్కలు సంరక్షించాలని తెలిపారు. మూత్రశాలలు, నీటి ట్యాంకులు, డ్రైనేజీ వ్యవస్థ ఇతరత్రాలను శుభ్రంగా నిర్వహించాలని, ప్రహారీగోడలు, చెట్లు, వంటశాలలకు పెయింటింగ్ చేయించాలని, దోమలు, కీటకాలు వృద్ధి చెందకుండా యాంటీ-లార్వా మందులు వినియోగించాలని తెలిపారు. కార్యక్రమ విజయవంతానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి నీలిమ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.