కిన్నెరసాని మంచినీటి కోసం సిపిఐ కౌన్సిలర్ల వినూత్న నిరసన

Published: Tuesday April 27, 2021
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 26, ప్రజాపాలన ప్రతినిధి : కొత్తగూడెం పట్టణ ప్రజానీకానికి గత 15 రోజుల నుండి కిన్నెర సాని మంచినీళ్లు నీళ్లు అందించడంలో నియోజకవర్గ ఎమ్మెల్యే, మున్సిపల్ అధికార పాలకపక్షం విఫలమైనందుకు సిపిఐ కౌన్సిలర్లు ఖాళీ బిందెలతో, తడి క్లాత్ తో నీళ్ల చుక్కలు మీద చల్లుకొని వినూత్న రీతిలో స్నానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై శ్రీనివాస్ రెడ్డి, పదో వార్డు మహిళా కౌన్సిలర్ మునిగడప పద్మ లు మాట్లాడుతూ 22 మంది మహిళా కౌన్సిలర్లు, చైర్ పర్సన్ మహిళ అయి ఉండి కూడా మహిళల నీటి కష్టాలు తీర్చడంలో అధికారిక పాలకపక్షం విఫలమైందని వారు విమర్శించారు. లక్షలాది రూపాయలు ప్రతి నెల మెయింటినెన్స్, లీకేజీల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, రోజు వారు మంచినీళ్లు అందించటంలోశాశ్వత పరిష్కారం చూపడంలో వైఫల్యం చెందుతున్నారని వారన్నారు. సుందరి కరణ పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తూ కిన్నెరసాని మంచినీటి సమస్యని విస్మరించడం తగునా అని ఎద్దేవా చేశారు. గత 15 రోజుల నుండి కొత్తగూడెం ప్రజల గొంతు ఎండు  తుంటే ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం న్యాయమా అని ప్రశ్నించారు. మొదట కొత్తగూడెం మున్సిపాలిటీ ఇంటి సమస్య అయినా ప్రజల దాహార్తిని తీర్చిన తర్వాతే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే బాగుంటుందని వారు అధికార పాలకపక్షానికి సూచనలు చేశారు. వెంటనే స్థానిక శాసనసభ్యులు, అధికారిక పాలకపక్షం స్పందించి కిన్నెరసాని మంచి నీళ్లు పునరుద్ధరించి ప్రతి రోజు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. లేకుండే ప్రజాగ్రహం తప్పదని వారు హెచ్చరించారు. అనంతరం కమిషనర్ సంపత్ కుమార్ కి వినతిపత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, మాచర్ల రాజకుమారి, నాయకులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, నేరెళ్లసమైక్య శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్, భానోత్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.