ఎల్ఐసి యజమాన్యం మొండివైఖరి విడనాడాలి బ్రాంచ్ కార్యాలయం ముందు ఏజెంట్ల ధర్నా

Published: Friday September 02, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 01 (ప్రజాపాలన ప్రతినిధి): ఎల్ఐసి యాజమాన్యం అసంబద్ధ, నిరంకుశ వైఖరి నిరసిస్తూ జగిత్యాల జీవిత బీమా కార్యాలయం ముందు ఏజెంట్లు నల్లబ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. భారతీయ జీవిత బీమా ఆల్ ఇండియా ఏజెంట్ల సమాఖ్య 1964 జేఏసీ పిలుపుమేరకు యాజమాన్యం మొండివైఖరి నిరసిస్తూ భారతీయ జీవిత బీమా సంస్థ 66 వ వారోత్సవాలను బహిష్కరిస్తూ నిరసన వ్యక్తం చేశారు. భారత దేశ వ్యాప్తంగా ఏజెంట్లు తమ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలతో ఈ నెల 1 నుండి 7వ తేది వరకు వారం రోజుల పాటు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఏజెంట్ల సమాఖ్య అధ్యక్షుడు ఎనుగుర్తి వెంకటస్వామి తెలిపారు. ఎల్ఐసి పాలసీ దారులకు పాలసీలపై బోనస్ పెంచడం తో పాటు, ఇన్సూరెన్స్ పాలసీ లపై జీఎస్టీ రద్దు, పాలసీలపై ఇస్తున్న లోన్స్ మరియు బకాయి ప్రీమియం లపై వడ్డీరేట్ల తగ్గింపు, ఎల్ఐసి పాలసీ బాండ్లను పోస్టల్ ద్వారా కాకుండా పాత పద్ధతిలోనే ఇవ్వాలని, ఐదు సంవత్సరాల పైబడిన కట్టని ల్యాప్స్ పాలసీలను పునరుద్ధరణకు పాలసీదారులకు అవకాశం కల్పించాలని, ఏజెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ పెంపుదల , పాలసీదారులు మెరుగైన సేవలు అందించాలనే తదితర డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు భారత దేశ వ్యాప్తంగా వారం రోజుల పాటు చేపట్టడం జరుగుతుందని అధ్యక్షులు వెంకటస్వామి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి పాదం ఐలయ్య, కోశాధికారి జున్ను మల్లయ్య ఉపాధ్యక్షులు చెన్నూరు గంగాధర్ తో పాటు పలువురు ఏజెంట్లు పాల్గొన్నారు.