వ్యవసాయం పరిశ్రమగా రూపాంతరం చెందాలి

Published: Friday August 27, 2021
* వికారాబాద్ పట్టణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన కుటుంబానికి మరొక్క అవకాశం
* తాత ముద్ద మల్లప్ప అభివృద్ధి బాటలో మనుమరాలు ముద్ద దీప భక్తవత్సలం నడవాలి
* పాలనాధికారంలో మహిళల పాత్ర అద్వితీయం
* వికారాబాద్ నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 26 ఆగస్ట్ ప్రజాపాలన : వ్యవసాయం ఒక పరిశ్రమగా రూపాంతరం చెందాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణలోని ప్రతి రైతు కుటంబం సుఖశాంతులతో జీవించే విధంగా సిఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ షెడ్డులో పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి విద్యాశాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం రైతుల అభివృద్ధికి మూసపద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే వికారాబాద్ మార్కెట్ కమిటీకి ముద్ద దీప భక్తవత్సలం చైర్మన్ గా కాగలిగారని చెప్పారు. రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా తగిన పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన తాత ముద్దమల్లప్పలా కీర్తి ప్రతిష్ఠలు తెచ్చుకోవాలని చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ముద్ద దీప భక్తవత్సలానికి మార్గదర్శనం చేశారు. రైతుల కష్టాలను తెలుసుకున్న సిఎం కేసిఆర్ రైతు సంక్షేమ పథకాలను తెచ్చాడని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతుల బాధలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. స్వరాష్ట్రం సిద్ధించుకున్న తరువాత రైతుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసిందని ఉద్ఘాటించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పంటల దిగబడి పెరిగిందన్నారు. మార్కెట్ కమిటీకి వచ్చే రైతులకు రెస్ట్ రూమ్, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. రెండవ విడతలో వికారాబాద్ కు మెడికల్ కళాశాలను తప్పకుండా మంజూరు చేస్తామని సిఎం కేసిఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అనంతగిరిలో టూరిజం ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు. 30 లక్షల మంది రైతులకు 25 వేలు, 6 లక్షల మందికి 50 వేల రుణ మాఫీ చేశామని అన్నారు. చేవెళ్ళ ఎంపి జి.రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. పంట మార్పిడి విధానాన్ని రైతులు అనుసరించాలని హితవు పలికారు. అధికలాభాలు రావాలంటే పంట మార్పిడి అత్యంతావశ్యకమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక మహిళను మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముద్ద దీప భక్తవత్సలాన్ని నియమించిన ఘనత సిఎం కేసీఆర్ కు దక్కుతుందని కొనియాడారు. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర వచ్చేలా జాగ్తత్త తీసుకోవాలని సూచించారు. డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. వికారాబాద్ డాక్టర్ల అసోసియేషన్ నుండి మార్కెట్ కమిటీ అధ్యక్షురాలిగా డాక్టర్ ముద్ద దీప భక్తవత్సలం నియమింపబడిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి నెల రెండవ ఆదివారం డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ గిరీషలతో కలిసి రైతులకు ఉచిత వైద్య చికిత్సలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకట్ రెడ్డి నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముద్ద దీపను, ఉపాధ్యక్షునిగా మేక చంద్రశేఖర్ రెడ్డిని, డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్య మౌళిక వసతుల కల్పనల సంస్థ అధ్యక్షుడు జి.నాగేందర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్, నూతన మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు మేక చంద్రశేఖర్ రెడ్డి, నూతన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.